నిజామాబాద్‌లో రెండు ఆసుపత్రులు సీజ్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న రెండు ప్రైవేట్‌ ఆసుపత్రులను బుధవారం సీజ్‌ చేశామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో సదుపాయాలు, నిబంధనల అమలు తీరును పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలచే ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా నిబంధనలు అతిక్రమిస్తూ, సరైన లేబర్‌ రూమ్‌, ఇతర కనీస వసతులు లేకుండా నిర్వహిస్తున్న నిజామాబాద్‌ నగరంలోని సిల్వర్‌ లైన్‌ హాస్పిటల్‌ ను సీజ్‌ చేశామని వివరించారు. అలాగే, కేర్‌ క్యూర్‌ ఆసుపత్రిలో లేబర్‌ రూమ్‌, ఆపరేషన్‌ థియేటర్‌ సరిగా లేకపోవడాన్ని గుర్తించి ఆ హాస్పిటల్‌ను కూడా సీజ్‌ చేయటం జరిగిందని తెలిపారు.

అదేవిధంగా లైఫ్‌ కేర్‌ హాస్పటల్‌, శ్రీ సూర్య హాస్పిటల్‌, కావేరి హాస్పిటల్‌లను సందర్శించటం జరిగిందని, ఈ ఆసుపత్రుల్లో సరైన క్వాలిఫై ఉన్న క్రింది స్థాయి సిబ్బంది లేకపోవడం, డాక్టర్స్‌ అందుబాటులో లేకపోవడాన్ని గమనించి నిర్వాకులను మందలించటం జరిగిందన్నారు. కాగా, ఎం.ఆర్‌ హాస్పిటల్‌లో ప్రస్తుతం ప్రసవాలు చేయటం లేదని, జ్యోతి హాస్పిటల్‌ విజిట్‌ చేయగా, రెన్నోవేషన్‌లో ఉన్నదని తెలిపారు. ఈ హాస్పిటల్‌ నందు ఉన్న ల్యాబ్‌ సీజ్‌ చేయటం జరిగిందన్నారు.

ఇదిలావుండగా, హష్మీకాలనిలో ఎలాంటి శిక్షణ లేకుండానే గంగామణి (దాయమ్మ) అనే మహిళ తన ఇంట్లో కాన్పులు నిర్వహిస్తోందనే సమాచారం మేరకు ఆమె ఇంటిని ఆకస్మికంగా తనిఖీ చేశామన్నారు. ఈ సందర్భంగా గంగామణి అసురక్షిత పద్ధతుల్లో ప్రసవాలు చేస్తున్నట్టు వెల్లడైందని, ఆమె ఇంటి నుండి కాన్పులు చేయడానికి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు.

అలాగే, మక్కా మసీదు సమీపంలో రిజ్వానా పర్వీన్‌ అనే బి.యూ.ఎం.ఎస్‌ డిగ్రీ కలిగిన వైద్యురాలు నిర్వహిస్తున్న క్లినిక్‌ను తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్న డ్రగ్‌ స్టోర్‌ను సీజ్‌ చేశామన్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు తనతో పాటు ప్రోగ్రామ్‌ ఆఫీసర్లతో కూడిన బృందం నిజామాబాదు నగరంలో గల ప్రైవేట్‌ హాస్పటల్స్‌ను పరిశీలన చేశామన్నారు. ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అంజన, డాక్టర్‌ తుకారం రాథోడ్‌, డాక్టర్‌ అశోక్‌, డాక్టర్‌ రాజేష్‌, ఏ.ఓ డెమో గంగాధర్‌ తనిఖీల్లో పాల్గొన్నారని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సుదర్శనం వివరించారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »