నిజామాబాద్, అక్టోబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిజీరియన్ ఆపరేషన్లను నియంత్రిస్తూ, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించే దిశగా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. సిజీరియన్ కాన్పుల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలకు వివరంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, నిజామాబాద్ తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఒకింత ఎక్కువ సంఖ్యలో సిజీరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయని, ఇది ఆరోగ్యకర సమాజాన్ని చేటు కలిగించే పరిణామంగా మారిందని ఆందోళన వెలిబుచ్చారు. వీటిని నియంత్రించేందుకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని వివరించారు.
గత మే మాసంలో జిల్లాలో సగటున 77 శాతం సిజీరియన్లు జరిగేవి కాగా, వాటిని ప్రస్తుతం 70 శాతానికి తగ్గించగలిగామని తెలిపారు. అయితే ఇంకనూ వీటికి అడ్డుకట్ట వేస్తూ, సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలకు ప్రజల నుండి కూడా సహకారం అవసరమని, ముఖ్యంగా గర్భిణీలు, వారి కుటుంబ సభ్యులు నార్మల్ డెలివరీలకే ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ కోరారు.
ఏ రకంగా చూసినా తల్లీ, బిడ్డకు సాధారణ ప్రసవాలు ఎంతో శ్రేయస్కరమని, పుట్టిన శిశువుకు అమృతంతో సమానంగా భావించే ముర్రుపాలు గంట వ్యవధిలోనే అందించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. సిజీరియన్ జరిగితే ఈ అవకాశం ఉండదని, తల్లి, బిడ్డల ఆరోగ్యం పరంగా కూడా అనేక దుష్ప్రభావాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుందన్నారు. దీనిని గమనించి గర్భిణీలు, వారి కుటుంబీకులు సాధారణ కాన్పులకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజీరియన్లు 54 శాతం జరుగుతుండగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 90 శాతం అవుతున్నాయని అన్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని అవసరం లేకపోయినా సిజీరియన్లు చేస్తున్న ఆసుపత్రులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలతో పరిశీలన జరిపిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా సరైన వసతులు లేని రెండు ఆసుపత్రులను గుర్తించి సీజ్ చేశామని, శాశ్వత గైనకాలజిస్టులను ఏర్పాటు చేసుకోకుండానే ప్రసవాలు చేస్తున్న మరో 18 ఆసుపత్రులకు నోటీసులు అందించడం జరిగిందన్నారు. నిబంధనలు అతిక్రమిస్తూ అవసరం లేకపోయినా సిజీరియన్లు చేసే ఆసుపత్రుల నిర్వాహకులను ఉపేక్షించబోమని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.