గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా ఈ నెల 16 వ తేదీన జరుగనున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌లో గురువారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఏర్పాట్ల గురించి, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనల గురించి కలెక్టర్‌ వివరించారు.

16 వ తేదీన ఉదయం 10.30 గంటల నుండి మధ్యాన్నం 1 గంట వరకు కొనసాగే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు జిల్లాలో 12858 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని, వీరి కోసం జిల్లా కేంద్రంలో 40 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌ ద్వారా ఇప్పటికే 70 శాతం మంది హాల్‌ టికెట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని, మిగతా వారు కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

హాల్‌ టికెట్లో ఎవరికైనా ఫోటో ప్రింట్‌ కాని పక్షంలో మూడు పాస్‌ పోర్ట్‌ సైజు ఫోటోలను తెల్ల కాగితంపై అతికించి గజిటెడ్‌ అధికారి అటెస్టేషన్‌ తో హాజరు కావాలన్నారు. అభ్యర్థులు తమవెంట తప్పనిసరిగా ఆధార్‌, పాన్‌ కార్డు, ఓటర్‌ ఐ.డీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి గుర్తింపు కార్డులో ఏదైనా ఒక గుర్తింపు కార్డును తేవాలని, బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌ తెచ్చుకోవాలని సూచించారు. సెల్‌ఫోన్‌, క్యాలిక్యులేటర్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, ఎగ్జామ్‌ ప్యాడ్‌ కు అనుమతి లేనందున వాటిని వెంట తెచ్చుకోకూడదని అన్నారు.

ఈసారి ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఎలక్రానిక్‌ పరికరాల గుర్తింపు కోసం ప్రత్యేకంగా మెటల్‌ డిటెక్టర్‌ లను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. వీలైనంత వరకు చెప్పులు ధరించి రావాలని, బయోమెట్రిక్‌ విధానం ఉన్నందున చేతులకు గోరింటాకు, ఇతరాత్రా పెయింట్‌లు ఉండకుండా చూసుకోవాలని హితవు పలికారు. జిల్లాకు సంబంధించి 24 మంది దివ్యంగులైన అభ్యర్థులు తమకు బదులుగా ఇతరులచే పరీక్ష రాసేందుకు అనుమతి కోరారని, అలాంటివారు ఇంటర్మీడియట్‌ కంటే తక్కువ విద్యార్హత కలిగిన వారితోనే పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుందని, తమవెంట వైకల్యం ధృవీకరించే సర్టిఫికెట్‌ తేవాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే, జిల్లా స్థాయిలో నెలకొల్పిన కంట్రోల్‌ రూమ్‌ 08462 – 220183 నెంబర్‌ కు ఫోన్‌ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని, అభ్యర్థులు టీ ఎస్‌ పీ ఎస్‌ సీ కాల్‌ సెంటర్‌ 040 – 22445566 నెంబర్‌ కు కూడా నేరుగా ఫోన్‌ చేయవచ్చని అన్నారు. హాల్‌ టికెట్‌ లో పొందుపర్చబడిన పరీక్షా కేంద్రాన్ని అభ్యర్థులు ముందుగానే వెళ్లి పరిశీలించుకుంటే పరీక్ష రోజున గందరగోళానికి గురయ్యే పరిస్థితి ఉండదని కలెక్టర్‌ హితవు పలికారు. ఈసారి ప్రిలిమ్స్‌ పరీక్షకు బయో మెట్రిక్‌ విధానం ద్వారా వేలిముద్రల సేకరణ ప్రక్రియ తప్పనిసరి చేసినందున అభ్యర్థులు నిర్ణీత సమయానికి కనీసం రెండు గంటలు ముందే కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

ప్రతి 60 మందికి ఒక బయో మెట్రిక్‌ యూనిట్‌ అందుబాటులో ఉంటుందన్నారు. ఉదయం 10.15 గంటల వరకే పరీక్షా కేంద్రం లోనికి వెళ్లేందుకు అనుమతించడం జరుగుతుందని, అనంతరం గేట్లు మూసివేస్తారని స్పష్టం చేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే అభ్యర్థులంతా ఉదయం 8 గంటల వరకు జిల్లా కేంద్రానికి చేరుకునేలా ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ప్రతి పరీక్షా కేంద్రంలోనూ డ్యూయల్‌ డెస్క్‌ టేబుళ్లు, పరీక్షా గదుల్లో తగినంత వెలుతురు, సరిపడా లైటింగ్‌, తాగునీరు, టాయిలెట్‌ ఇత్యాది వసతులు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. ప్రతి కేంద్రంలో ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌ ను నియమిస్తున్నామని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తూ, పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్‌ సెంటర్‌ లను మూసి ఉంచేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

అన్ని కేంద్రాల వద్ద మహిళా పోలీసు సిబ్బంది సైతం ఉంటారని, అభ్యర్థుల సహాయార్ధం బస్టాండ్లలో హెల్ప్‌ డెస్క్‌ లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి 24 మంది అభ్యర్థులకు ఒక ఇన్విజిలేటర్‌ చొప్పున నియమిస్తూ,వారికి పరీక్షల నిర్వహణ, నిబంధనల పై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసిన అన్ని పరీక్షా కేంద్రాల్లోని ప్రతి గదిలోనూ సి.సి కెమెరాలు ఉండగా, ప్రభుత్వ విద్యా సంస్థల్లోని కేంద్రాల్లో వీడియో రికార్డింగ్‌ జరిపిస్తామన్నారు.

ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక సిట్టింగ్‌ స్క్వాడ్‌, 7 కేంద్రాలకు ఒక ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను నియమిస్తున్నామని తెలిపారు. ఎలాంటి అపశ్రుతులు, అపవాదులకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అభ్యర్థులు నిబంధనలను తు.చ తప్పకుండా పాటించాలని సూచించారు. విలేకరుల సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »