కామారెడ్డి, అక్టోబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాణ్యత ప్రమాణాలు పాటించి పత్తిని రైతులు జిన్నింగ్ మిల్లులకు తరలించి గిట్టుబాటు ధర పొందాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జిన్నింగ్ మిల్లులో యజమానులతో, మార్కెటింగ్, వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మద్దునూరులో పత్తి కొనుగోలు కోసం 8 జిన్నింగ్ మిల్లులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మిల్లుల వద్ద ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో సాగుచేసిన వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, జొన్నలు, సజ్జలు, పెసర్లు, మినుములు, కందుల విస్తీర్ణం వివరాలు వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
వరి ఏ గ్రేడ్ రకానికి క్వింటాల్ కు రూ.2060, సాధారణ రకం కు 2040, పత్తి పొడవుపింజ రకం కు రూ.6,380, సాధారణ రకం కురూ.6080, మొక్కజొన్న క్వింటాల్ కు రూ.1962, సోయాబీన్ క్వింటాల్ కు రూ.4,300 చొప్పున ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు.
వానకాలం పంటలకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర వాల్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ అన్యోన్య, జిల్లా రవాణా అధికారిని వాణి, జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, మార్కెటింగ్ అధికారిని రమ్య, జిన్నింగ్ మిల్లుల యజమానులు, అధికారులు పాల్గొన్నారు.