మన ఊరు-మన బడి పనులు వారంలో పూర్తి కావాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెంపొందించేందుకు వీలుగా మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులకు ప్రాధాన్యతనిస్తూ వేగవంతంగా జరిపించాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సూచించారు. మొదటి విడతగా జిల్లాలో మంజూరీ తెలిపిన మొత్తం114 పాఠశాలల్లోనూ వారం రోజుల్లోపు పనులన్నీ పూర్తి కావాలని స్పష్టమైన గడువు విధించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ సంబంధిత అధికారులతో మన ఊరు-మన బడి, ధరణి, పోడు భూములు, తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలు తదితర అంశాలపై సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా మన ఊరు-మన బడి పనుల ప్రగతి గురించి ఒక్కో మండలం వారీగా అధికారులను ఆరా తీశారు. నిధుల కొరత ఎంతమాత్రం లేదని, పనులు చేపట్టిన వెంటనే వెంటది వెంట బిల్లులు చెల్లిస్తున్నామని కలెక్టర్‌ గుర్తు చేశారు. గోడలు, సీలింగ్‌ కు పెయింటింగ్‌ వేసే ఏజెన్సీ జిల్లాకు చేరుకున్నందున తక్షణమే పనులను పూర్తి చేయించేందుకు చొరవ చూపాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారం రోజుల గడువు ముగిశాక, ఏ ఒక్క పని కూడా పెండిరగ్‌ ఉండకూడదని కలెక్టర్‌ ఆదేశించారు.

అదే సమయంలో పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా క్షేత్రస్థాయిలో బడులను సందర్శించి పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని మండల ప్రత్యేక అధికారులకు సూచించారు. డ్యూయల్‌ డెస్క్‌ లు, బోర్డులు త్వరలోనే జిల్లాకు చేరుకోనున్నందున, ఏ చిన్న పని కూడా మిగిలిపోకుండా వెంటనే పూర్తి చేయించాలన్నారు.

పోడు భూముల పరిశీలన ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే దాఖలై ఉన్న క్లెయిమ్‌ లను క్షేత్రస్థాయిలో సమగ్రంగా వెరీఫికేషన్‌ జరుపుతూ, ఆన్‌ లైన్లో వెంటది వెంట వివరాలను నమోదు చేయాలని సూచించారు. వచ్చే సోమవారం సాయంత్రం నాటికి వెరీఫికేషన్‌ వివరాలన్నీ ఆన్‌ లైన్లో నమోదును పూర్తి చేయాలన్నారు.

ఈ విషయంలో అలసత్వం కనబరిచే వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. కాగా, క్షేత్రస్థాయి పరిశీలన సందర్భంగా ఎదురైన పలు అంశాలను అధికారులు కలెక్టర్‌ దృష్టికి తేగా, వారి సందేహాలను నివృత్తి చేశారు. వెరీఫికేషన్‌ వివరాల నమోదులో తప్పులకు ఆస్కారం కల్పించకూడదని, జాగ్రత్తగా ఆన్‌లైన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని హితవు పలికారు. కాగా, ధరణి పెండిరగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్‌లను ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్‌ లో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, బి.చంద్రశేఖర్‌, డీఎఫ్‌ఓ వికాస్‌ మీనా, మండల స్పెషల్‌ ఆఫీసర్లు, ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఏపీఓలు, ఎంపీఓలు, ఎఈఓలు, ఫారెస్ట్‌, ఇంజినీరింగ్‌ విభాగాల అధికారులు, సర్వేయర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »