కామారెడ్డి, అక్టోబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రూప్ -1 ప్రాథమిక పరీక్ష ఇన్విజిలేటర్లను లాటరీ విధానంలో ఎంపిక చేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం అధికారులతో గ్రూప్ -1 పరీక్ష నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 16న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతోందని తెలిపారు. అభ్యర్థులు రెండు గంటల ముందు పరీక్ష కేంద్రాలకు హాజరుకావాలని సూచించారు.
ఉదయం 10:15 గంటలకు పరీక్ష కేంద్రాల గేట్లను మూసివేయాలని కోరారు. జిల్లా కేంద్రంలో 9 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 4,549 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్‌లో వసతి కల్పిస్తామని చెప్పారు. పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులు ఎవరు పరీక్ష కేంద్రం నుంచి బయటకు వెళ్లనివ్వరాదని పేర్కొన్నారు.
అభ్యర్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ మార్గదర్శకాల మేరకు ప్రాథమిక పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రంలో అధికారులు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, చీఫ్ సూపరింటెండెంట్లు, లైసన్ ఆఫీసర్లు పాల్గొన్నారు.