నిజామాబాద్, అక్టోబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరానికి ఆనుకుని మల్లారం గ్రామ పరిధిలో గోడౌన్‌ల పక్కన వేలంపాట ద్వారా విక్రయించనున్న ప్రభుత్వ నివేశన స్థలాలను శుక్రవారం కలెక్టర్ సి.నారాయణరెడ్డి సందర్శించి క్షేత్రస్థాయిలో స్థానికంగా నెలకొని ఉన్న పరిస్థితులను పరిశీలించారు. వచ్చే నెల 14 వ తేదీన వేలంపాట నిర్వహించేందుకు సిద్ధం చేసిన 80 ప్లాట్లను పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు.
ఇప్పటికే డీటీసీపీ ద్వారా లే అవుట్ అనుమతి కలిగి ఉన్నందున, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రోడ్లు, ట్రయినేజీల నిర్మాణాలను తక్షణమే ప్రారంభించాలని, నీటి వసతి, విద్యుత్ వసతి అందుబాటులో ఉండాలన్నారు.
ఈ పనులన్నీ ఇరవై రోజుల వ్యవధిలో పూర్తి కావాలని గడువు విధించారు. పనులు చేపట్టే విషయంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అయినా, వెంటనే తమ దృష్టికి తేవాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, నిజామాబాద్ ఆర్దీఓ రవి, నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ అనిల్, టీఎస్‌ఐఐసి జిల్లా జనరల్ మేనేజర్ రాందాస్ తదితరులు ఉన్నారు.