ఎడపల్లి, అక్టోబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సేంద్రీయ సాగు లాభదాయకంగా వుంటుందని, దిగుబడి కొంత తగ్గినా లాభాలు మాత్రం ఎక్కువగా ఉంటాయని పలువురు రైతు నేస్తం, నాబార్డ్ ప్రతినిధులు తెలిపారు. సేంద్రియ సాగులో పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ వుందని, సేంద్రియ సాగు కొంచెం కష్టమైనా పలితాలు బాగుంటాయని, ప్రస్తుత సమాజంలో రసాయన ఎరువులతో పండిరచిన పంటల కంటే సేంద్రీయ సాగులో పండిరచిన పంటలకు డిమాండ్ ఎక్కువగా ఉందని వారు తెలిపారు.
ఈ మేరకు సేంద్రియ సాగు విధానం, కషాయాల మిశ్రమం తయారీ అనే అంశాలపై ఆదివారం ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో రైతు శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రైతు నేస్తం ఫౌండేషన్, నాబార్డ్ ఆద్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతులకు సేంద్రియ సాగులో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
జైతాపూర్ గ్రామానికి చెందిన సేంద్రియ సాగు రైతు కరుటూరి పాపారావు వ్యవసాయ క్షేత్రంలో రైతు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్య్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 100 మంది రైతులు హాజరై ఆదర్శ రైతు పాపారావు వ్యవసాయ క్షేత్రంలో సేంద్రీయ సాగుతో పండిస్తున్న పంటలను పరిశీలించారు. అలాగే తాము సాగు చేస్తున్న పంటలను, వాటిలో పాటించాల్సిన మెళుకువలను కార్యక్రమానికి వచ్చిన రైతులు వివరించారు.
కషాయాల మిశ్రమాలతో పంటలకు పిచికారీ చేస్తే తెగుళ్లు దరిచేరవని రోగాలు రావని ఫలితంగా రైతులకు ఆర్థికంగా ఆదా అవుతున్నాయని రైతులు తెలియజేశారు. అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్ సేంద్రీయ సాగు విధానం, వాటి వల్ల లాభాలు, మార్కెటింగ్‌పై పలు సూచనలు సలహాలు ఇచ్చారు.
భవిష్యత్తులో సేంద్రీయ సాగుకు మంచి గిరాకీ ఉంటుందని రైతులంతా సేంద్రియ సాగు చెయ్యాలని సూచించారు. రసాయన ఎరువులతో కాకుండా సేంద్రియ ఎరువులను తయారు చేసుకొని వాటితో పంటలు పండిస్తే ఆరోగ్యాన్ని రక్షించుకోవడంతో పాటు ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వారవుతారని తెలిపారు. కార్యక్రమంలో ఆదర్శ రైతు పాపారావు, రైతు నేస్తం ఫౌండేషన్ ప్రతి నిధులు, నాబార్ద్ సంస్థ ప్రతి నిధులు, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు.