నిజామాబాద్, అక్టోబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా ఆదివారం జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా సైతం పరీక్షా కేంద్రాలను సందర్శించారు.
జిల్లా కేంద్రంలోని కాకతీయ కళాశాలలోని రెండు ఎగ్జామ్ సెంటర్లను, గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు.
అభ్యర్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? లేదా? అన్నది సి.సి కెమెరా ఫుటేజీ ల పరిశీలన ద్వారా నిర్ధారణ చేసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి అందుబాటులో ఉందా లేదా అని గమనించారు. ఎగ్జామ్ హాల్లోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతి లేనందున అభ్యర్థులను మెటల్ డిటెక్టర్లలతో క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు.
కాగా, ఆయా కేంద్రాల్లో బయోమెట్రిక్ ద్వారా జరిపిన వేలిముద్రల సేకరణ ప్రక్రియ గురించి కలెక్టర్ ఆరా తీశారు. పరీక్షా కేంద్రాల్లోని గదులను సందర్శిస్తూ, అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సదుపాయాలను గమనించి ముఖ్య పర్యవేక్షకులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో 77.69 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు. మొత్తం 12858 మంది అభ్యర్థులకు గాను 9990 మంది పరీక్ష రాయగా, 2868 మంది గైర్హాజరయ్యారని వివరించారు.
కాగా, అంతకుముందు పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ నుండి కట్టుదిట్టమైన పోలీసు భద్రత నడుమ ఆయా రూట్ల వారీగా ప్రశ్న పత్రాలు, ఇతర సామాగ్రిని ఆయా పరీక్షా కేంద్రాలకు తరలించారు. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష కొనసాగగా, పరీక్ష ముగిసిన అనంతరం అభ్యర్థుల ఓ.ఎం. ఆర్ షీట్లు, ఇతర సామాగ్రిని నిబంధనలకు అనుగుణంగా సీల్ వేసి పోలీస్ ఎస్కార్ట్ నడుమ స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు.
ఈ ప్రక్రియను అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా, నిజామాబాద్ ఆర్డీవో రవి క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించడంతో పాటు వీడియో రికార్డింగ్ జరిపించారు. జిల్లా యంత్రాంగం ముందస్తుగానే విస్తృత స్థాయిలో చర్యలు తీసుకున్న దరిమిలా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో, సజావుగా ప్రిలిమ్స్ పరీక్షలు ముగిసాయి.
కలెక్టర్ సూచనల మేరకు ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాల వద్ద అభ్యర్థులకు సహాయంగా హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయడంతో పాటు పరీక్షా కేంద్రాల వద్ద సమగ్ర వివరాలను, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను క్షుణ్ణంగా తెలియజేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సత్ఫలితాలు ఇచ్చింది. కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్‌లు నటరాజ్, ప్రసాద్ రావు, లైజనింగ్ అధికారులు ఉన్నారు.