నిజామాబాద్, అక్టోబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆయా శాఖల అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 80 ఫిర్యాదులు అందాయి.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఆర్డీఏ డీపీఎం రాచయ్యలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను వెంటదివెంట పరిశీలన జరుపుతూ, ప్రజావాణి సైట్‌లో వివరాలను అప్‌లోడ్ చేయాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు.
కాగా, ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులకు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పలు అంశాలపై సూచనలు చేశారు. మన ఊరు – మన బడి కార్యక్రమం కింద తొలివిడత పాఠశాలల్లో చేపట్టిన పనులను వారం రోజుల వ్యవధిలో పూర్తయ్యేలా చొరవ చూపాలని అన్నారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన వరి ధాన్యం సేకరణ కోసం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రభుత్వం నుండి అనుమతి లభించిన మీదట కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందన్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభమయ్యే నాటికే సంబంధిత శాఖల అధికారులు వరి కొనుగోళ్ళకు అన్ని విధాలుగా సమాయత్తం అయి ఉండాలని హితవు పలికారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా ఈ ప్రక్రియ జరిగేలా సమన్వయంతో కృషి చేయాలన్నారు.
ఇదిలాఉండగా, టీ ఎస్ పీ ఎస్ సీ ద్వారా జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను కలెక్టర్ నేతృత్వంలో ఆయా శాఖల అధికారులు ప్రణాళికాబద్ధంగా పని చేసినందున జిల్లాలో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించగలిగామని పేర్కొన్న అదనపు కలెక్టర్, ఇందుకు కృషి చేసిన అధికారులకు జిల్లా యంత్రాంగం తరఫున అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.