నిజామాబాద్, అక్టోబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. పెండిరగ్ ఫిర్యాదులపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అన్నింటిని పరిష్కరించాలని కోరారు. ప్రజావాణిలో భూ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చే ఫిర్యాదులు, వినతులపై రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలన్నారు. వీటితో పాటు భూ సమస్యల పరిష్కారం కోసం నేరుగా ధరణికి వచ్చే దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపి పరిష్కరించాలన్నారు.
సోమవారం ప్రజావాణికి మొత్తం 85 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో డిఆర్డిఓ సాయన్న, జెడ్పి సీఈవో సాయా గౌడ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.