డ్రాగన్‌ ఫ్రూట్‌ పంట క్షేత్రాన్ని సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోపాల్‌ మండలం కంజర గ్రామంలో ఎండీ. తమీమ్‌ అనే ఆదర్శ రైతు సాగు చేస్తున్న డ్రాగన్‌ ఫ్రూట్‌ పంట క్షేత్రాన్ని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి మంగళవారం సందర్శించారు. రసాయనిక ఎరువులకు స్వస్తి పలికి, పూర్తిగా సేంద్రీయ పద్ధతులను అవలంభిస్తూ ప్రయోగాత్మకంగా ఎకరన్నర విస్తీర్ణంలో పండిస్తున్న పంట క్షేత్రాన్ని కలెక్టర్‌ ఎంతో ఆసక్తిగా పరిశీలించారు.

డ్రాగన్‌ ఫ్రూట్‌ పండిరచడంలో పాటిస్తున్న యాజమాన్య పద్ధతులు, పాటిస్తున్న మెళుకువల గురించి రైతు తమీమ్‌ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎకరం విస్తీర్ణంలో ఈ పంట పండిరచేందుకు సుమారు ఐదు నుండి ఆరు లక్షల వరకు పెట్టుబడి వ్యయం అవుతోందని తమీమ్‌ కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. కాక్టస్‌ (బ్రహ్మజెముడు, నాగజెముడు) జాతికి చెందిన డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కను నాటిన మూడు సంవత్సరాల తరువాత దిగుబడులు చేతికందడం ప్రారంభం అవుతుందని వివరించారు.

ఏకధాటిగా 35 సంవత్సరాల వరకు ప్రతీ యేటా రెండు పర్యాయాలు దిగుబడులు వస్తూనే ఉంటాయన్నారు. ప్రతిసారి ఎకరాకు 10 టన్నుల వరకు దిగుబడి వస్తుందని, డ్రాగన్‌ ఫ్రూట్‌ కు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉందని, ఎకరాకు హీనంగా లెక్కించినా కనీసం పది లక్షల రూపాయల వరకు ఆదాయం లభిస్తుందని అన్నారు. ఇప్పటికే తాను రిటైల్‌గా కిలోకు 200 రూపాయల చొప్పున 3 టన్నుల పంట విక్రయించానని కలెక్టర్‌కు వివరించగా, జిల్లా పాలనాధికారి తమీమ్‌ను అభినందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రైతులు మూస ధోరణిని వీడి, మార్కెట్లో మంచి డిమాండ్‌ కలిగిన పంటలను సాగు చేయాలని హితవు పలికారు. ముఖ్యంగా యువ రైతులు వినూత్న పద్ధతుల్లో ప్రయోగాత్మక పంటల సాగుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సాంప్రదాయంగా వస్తున్న వరి పంట సాగు చేస్తే ఎకరానికి 20 నుండి 30 వేల రూపాయల వరకే ఆదాయం లభిస్తుందన్నారు. అందుకు భిన్నంగా రైతు తమీమ్‌ వినూత్నమైన ఆలోచనతో ప్రయోగాత్మకంగా డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగును చేపట్టడం వల్ల ఎకరాకు కనీసం రూ. ఐదు లక్షల వరకు లాభాలు ఆర్జిస్తున్నారని అన్నారు.

డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేపట్టేందుకు ముందుకు వచ్చే రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఉద్యానవన శాఖ ద్వారా ఎకరానికి మూడు విడతల్లో 96 వేల రూపాయల సబ్సిడీని అందిస్తోందన్నారు. డ్రాగన్‌ ఫ్రూట్‌ అనే కాకుండా ఇదే తరహాలో మార్కెట్‌ లో మంచి డిమాండ్‌ ఉన్న పంటలను ఎంపిక చేసుకుంటే రైతులు అధిక లాభాలు ఆర్జించేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్‌ పేర్కొన్నారు.

తద్వారా ప్రయోగాత్మక పంటల సాగు వల్ల స్థానిక అవసరాలు కూడా తీరుతాయని అభిప్రాయపడ్డారు. అధునాతన పద్ధతుల్లో వినూత్న పంటల సాగుకు ముందుకు వచ్చే రైతులకు వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తూ, పాటించాల్సిన మెళుకువల గురించి తెలియజేస్తారని అన్నారు. కలెక్టర్‌ వెంట జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నర్సింగ్‌ దాస్‌ తదితరులు ఉన్నారు.

Check Also

వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని ఆర్థికంగా ఎదగాలి

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యాపారాన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »