నిజామాబాద్, అక్టోబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 28 న ఏఐటీయూసీ అనుబంధ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నట్టు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య తెలిపారు. మంగళవారం జిల్లా కార్యాలయంలో ఏఐటీయూసీ రాష్ట్ర మూడవ మహాసభలు పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఓమయ్య మాట్లాడుతూ ఈనెల 28వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో యూనియన్ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నారని, మహాసభల్లో మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి రాబోయే కాలంలో నిర్వహించే ఉద్యమాలను రూపకల్పన చేసుకోవడం జరుగుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కార్మికులకు వేతనాల పెంపుకై 11 వ పిఆర్సి అమలు చేస్తున్న సందర్భంలో మెడికల్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు జీవో ఎంఎస్ నెంబర్ 21 ద్వారా వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి 21 జీవోను నేటి వరకు గెజిట్ చేయకుండా కాలయాపన చేసి యూనియన్ ఆధ్వర్యంలో పోరాడిన సందర్భంలో మున్సిపల్ కార్మికులకు అమలు చేస్తున్నటువంటి జీవో ఎంఎస్ నెంబర్ 60 వీరికి కూడా అమలు చేస్తూ సర్కులర్ విడుదల చేయడం జరిగింది కానీ కాంట్రాక్టర్లు కార్మికులకు జీవో ప్రకారం కూడా వేతనాలు ఇవ్వకుండా కార్మికుల శ్రమ దోపిడీ చేస్తుంటే ఈ విషయమై ప్రభుత్వానికి జిల్లా అధికార యంత్రాంగానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదన్నారు.
కార్మికులకు ఇవ్వాల్సినటువంటి పండగ జాతీయ ఆర్జిత సెలవులు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. మహాసభల్లో పై సమస్యలతో పాటు 10 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ అయిన ప్రతి కార్మికుడికి పర్మినెంట్ చేయాలని డిమాండ్ తో రాబోయే కాలంలో పోరాటాలకు సిద్ధమవుతామని అన్నారు. మహాసభలను జిల్లాలోని మెడికల్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, థర్డ్ పార్టీ కార్మికులు ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి హైమది బేగం కోశాధికారి భాగ్యలక్ష్మి కార్యదర్శి కవిత, రాజు, సుశీల, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.