రెంజల్, అక్టోబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలీసు అమరవీరుల సేవలు మరువలేనివని, విధి నిర్వహణలో అమరులైన అమర జవానుల సేవలు ప్రజలలో చిరస్మరణీయంగా ఉంటాయని ఏసీపీ కిరణ్ కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు.
ప్రజలకు సేవలందించడంలో అంకిత భావం ప్రదర్శిస్తూ పోలీసులు వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కుటుంబ సభ్యులకు దూరమయ్యారని ఏసిపి గుర్తు చేశారు. వారి త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని చెప్పారు. ఈనెల 15 నుండి ఇలాంటి సభలు ఏర్పాటు చేస్తూ అమరుల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఎవరైనా ఫోన్ చేసి అకౌంట్ బుక్ వివరాలు అడిగితే ఇవ్వరాదని అలాంటి వ్యక్తులపై స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలన్నారు. యువత మద్యానికి బానిస కాకుండా దానివల్ల జరిగే అనర్ధాలను తెలిపారు. విద్యార్థులు ఉన్నత స్థాయి విద్యలో రాణించాలని అప్పుడే లక్ష్యాన్ని సాదించగలుగుతామని అన్నారు.
సైబర్ నేరాలు ఆన్లైన్ మోసాల పట్ల తల్లిదండ్రులను అప్రమత్తంగా చేయవలసిన బాధ్యత విద్యార్థులపై ఉంటుందన్నారు. కార్యక్రమంలో రూరల్ సిఐ శ్రీనివాస్ రాజ్, స్థానిక ఎస్సై సాయన్న, ప్రిన్సిపల్ బలరాం, ఎస్సై సత్యనారాయణ పోలీస్ సిబ్బంది ఉన్నారు.