కామారెడ్డి, అక్టోబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్ లోని ప్లాట్లు, గృహాలను వ్యక్తులు వేలంపాట ద్వారా సొంతం చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఫ్రీ బిడ్ సమావేశానికి హాజరై మాట్లాడారు. నవంబర్ 14 నుంచి 18 వరకు వేలంపాట నిర్వహిస్తామని తెలిపారు. వేలం పాటలో పాల్గొనే వ్యక్తులు కలెక్టర్ కామారెడ్డి పేరున రూ.10 వేలు డిడి కట్టాలని సూచించారు. వేలంలో పాల్గొనే వ్యక్తులు తమ వెంట ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం వంటి గుర్తింపు పత్రాలు తీసుకొని రావాలని పేర్కొన్నారు.
ప్రధాన జాతీయ రహదారి నెంబర్ 44 సమీపంలో కామారెడ్డి నుంచి రామారెడ్డి వైపు వెళ్లే రహదారి 100 ఫీట్ల ఆనుకొని ఉందన్నారు. వేలం పాటలో పాల్గొని ప్లాట్ కేటాయింపు జరిగిన నిర్ధారణ లేఖ ఇచ్చిన నాటి నుంచి ఏడు రోజులలోపు కొనుగోలు చేసిన ప్లాట్ మొత్తం విలువలో మొదటి విడతగా 33 శాతం చెల్లించాలన్నారు. కొనుగోలు చేసిన రోజు నుంచి 45 రోజులలోపు మొత్తం విలువలో రెండో విడతగా 33 శాతం చెల్లించాలని సూచించారు.
ప్లాట్ మొత్తం విలువలోని మిగతా మొత్తాన్ని ఈఎండి కలుపుకొని నిర్ధారణ లేఖ అందిన నాటి నుంచి 90 రోజులలోపు చెల్లించాలని పేర్కొన్నారు. ప్లాట్, ఇండ్ల ధర పైన 7.5 రిజిస్ట్రేషన్ చార్జీలు కొనుగోలుదారుడే భరించాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, జోనల్ మేనేజర్ రామ్ దాస్, ఆర్డీవో శీను, కలెక్టరేట్ ఏవో రవీందర్, సూపరిండెంట్ సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.