నిజామాబాద్, అక్టోబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతులు పెద్ద ఎత్తున సాగు చేసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి వచ్చే ట్రేడర్లకు ఎవరు కూడా ఎలాంటి ఆటంకాలు కల్పించకూడదని అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్ సూచించారు. ఒకవేళ ఎవరైనా ఆటంకాలు కల్పించినట్లు తమ దృష్టికి వస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
స్థానిక రైస్ మిల్లర్లు కూడా రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు కనీస మద్దతు ధరను చెల్లించి, రైతుల అంగీకారం మేరకు వారి నుండి ధాన్యం కొనుగోలు చేయాలని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. జిల్లాలో వరి కోతలు ఇప్పటికే ఊపందుకున్నాయని, ఈ నేపథ్యంలో రైతుల నుండి ధాన్యం సేకరించేందుకు పలువురు ట్రేడర్లు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి కూడా నిజామాబాద్ జిల్లాకు వచ్చి కొనుగోళ్లు జరుపుతున్నారని తెలిపారు.
ముఖ్యంగా జిల్లాలోని వర్ని, కోటగిరి, రుద్రూర్, బోధన్ తదితర ప్రాంతాల్లో ధాన్యం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. రైతుల నుండి ధాన్యం సేకరిస్తున్న వారికి ఎలాంటి ఆటంకాలు సృష్టించకూడదని, స్వేచ్ఛగా వారు రైతులకు కోరిన ధర చెల్లించి ధాన్యం కొనుగోళ్లు చేసుకోవచ్చని అన్నారు. ఈ ప్రక్రియకు ఎవరైనా ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.
రైతులు తమకు నచ్చిన ట్రేడర్లు, రైస్ మిల్లర్లకు ధాన్యం అమ్మోకోవచ్చని సూచించారు. ప్రస్తుతం మార్కెట్లో ధాన్యానికి మంచి డిమాండ్ ఉన్నందున రైతులు తొందరపడి మధ్యదళారులను నమ్మి మోసపోవద్దని హితవు పలికారు.