కామారెడ్డి, అక్టోబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పటిష్టమైన శాంతిభద్రతలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు.
పోలీస్ అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. సమాజాన్ని నేర రహితంగా మార్చడానికి పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. ప్రజా అవసరాల కోసం, సంరక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు దేశాంతర్గత భద్రత, ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం పోలీసు వ్యవస్థ కీలకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు.
శాంతి భద్రతలు సక్రమంగా ఉంటే మారుమూల గ్రామాల్లో కూడా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. అక్టోబర్ 21 నుంచి 31 వరకు జాతీయ ఐక్యత కోసం ప్రజలకు పోలీసులు మరింత చేరువ అయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయ మన్నారు.
అమరుల త్యాగాలు, ఆశయాల సాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంను గత సంవత్సరం నుంచి పోలీస్ ఫ్లాగ్ డే గా జరుపుకుంటున్నామన్నారు. పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉంటే అభివృద్ధి ప్రతి ఒక్కరికి చేరుతోందని చెప్పారు. ఈ సమాజం కోరుకునేది శాంతి, స్థిరత్వం, అభివృద్ధి, పోలీస్ శాఖ వారి త్యాగాల ద్వారా ఎన్నో దశాబ్దాలుగా భౌతిక రక్షణ నుంచి సామాజిక రుగ్మతలను పాల ద్రోలడం వరకు పోలీసు వ్యవస్థ కార్యదీక్షతో, సేవాతత్పరతతో పనిచేస్తుందన్నారు.
విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులైన పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం క్రమం తప్పకుండా ప్రతి ఏటా అక్టోబర్ 21న అమరవీరుల దినోత్సవం నిర్వహిస్తుందని చెప్పారు. అమరవీరులైన పోలీసుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ అక్టోబర్ 21 నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అక్టోబర్ 31వ తేదీ వరకు జాతీయ ఐక్యత దినోత్సవం వరకు సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, పోలీసు అధికారులు పాల్గొన్నారు.