నిజామాబాద్, అక్టోబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరానికి ఆనుకుని మల్లారం గ్రామ పరిధిలో గోడౌన్‌ల పక్కన ప్రభుత్వం ఆధ్వర్యంలో నెలకొల్పుతున్న ధాత్రి టౌన్ షిప్ ను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ టౌన్ షిప్‌లో ప్లాట్లను విక్రయించేందుకు నవంబర్ 14న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉదయం 11 గంటలకు వేలంపాట నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో టౌన్ షిప్ వద్ద కొనసాగుతున్న మౌలిక సదుపాయాల కల్పన పనులను కలెక్టర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆయా పనుల ప్రగతి గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వచ్చే నెల 14న ప్లాట్ల విక్రయానికి వేలం జరుగునున్నందున ఆలోపే కనీస మౌలిక సదుపాయాల కల్పనకై చేపట్టిన పనులన్నీ పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే డీటీసీపీ ద్వారా లే అవుట్ అనుమతి కలిగి ఉన్నందున ఈ భూములకు మంచి ధర వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా, రోడ్లు, ట్రయినేజీల నిర్మాణాలు, విద్యుత్ వసతి ఇత్యాది సౌకర్యాలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారి నుండి టౌన్ షిప్ వరకు బీ.టీ డబల్ రోడ్డుకు స్థానికులు, రైతులు సహకరిస్తే పరిసర ప్రాంతాల భూముల విలువ గణనీయంగా పెరిగి రెట్టింపు ధర పలుకుతాయన్నారు. ఇందుకు స్థానికులు అంగీకరిస్తే టీఎస్‌ఐఐసి నిధులతో వెంటనే డబల్ రోడ్డు వేయిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని స్థానికులు సహకరించేలా వారితో చర్చించాలని మల్లారం గ్రామ సర్పంచ్ నాగేష్, ఉపసర్పంచ్ రవికుమార్‌లకు సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ట్రాన్స్‌కో ఎస్.ఈ రవీందర్, నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ అనిల్, టీఎస్‌ఐఐసి జిల్లా జనరల్ మేనేజర్ రాందాస్ తదితరులు ఉన్నారు.