నిజామాబాద్, అక్టోబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మన ఊరు – మన బడి పనుల ప్రగతిపై అధికారులతో సమీక్ష జరిపారు. ఒక్కో మండలం వారీగా పనుల ప్రగతి గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా చాలా పాఠశాలల్లో ఇంకనూ పనులు అసంపూర్తిగా ఉండడం పట్ల కలెక్టర్ అసహనం వెలిబుచ్చారు.
మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ఉద్దేశించిన పనులను పూర్తి చేయించడంలో క్షేత్రస్థాయి అధికారులు నిర్లక్ష్యం వహించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, రెంజల్ మండల విద్యాశాఖ అధికారి రామ్ మోహన్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. మరో ఏడు మండలాలకు చెందిన ఏ.ఈలకు, రుద్రూర్ ఎం.ఈ.ఓకు సంజాయిషీ కోరుతూ మెమోలు జారీ చేయించారు.
క్రమం తప్పకుండా సమీక్షలు జరుపుతూ నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి చేయాలని పదేపదే సూచిస్తున్నప్పటికీ, ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని నిలదీశారు. వారం రోజుల్లోపు జిల్లాలో మొదటి విడతలో చేపట్టిన మొత్తం 114 పాఠశాలల్లోనూ పనులన్నీ పూర్తి కావాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏ చిన్న పని కూడా పెండిరగ్ లో ఉండకుండా, పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని, నాణ్యతతో పనులు జరిగేలా చూడాలని క్షేత్ర స్థాయి అధికారులతో పాటు, మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు.
ఈ పనులకు నిధుల కొరత ఎంతమాత్రం లేదని, పనులు ఆయా దశల వారీగా పూర్తయిన వెంటనే ఎం.బీ రికార్డులు చేసి పంపితే, తక్షణమే బిల్లులు మంజూరు చేస్తున్నామని అన్నారు. అలాంటప్పుడు సకాలంలో పనులను పూర్తి చేయించడానికి ఎందుకు చొరవ చూపడం లేదని అధికారులను నిలదీశారు. ఇప్పటికే అనేక పర్యాయాలు గడువు పొడిగిస్తూ వచ్చామని, ఇకపై ఎంతమాత్రం ఉపేక్షించబోమని కరాఖండీగా తేల్చి చెప్పారు.
వారం వ్యవధిలో సివిల్ వర్క్స్ పూర్తి చేయకపోతే ఏ.ఈలను బాధ్యులుగా పరిగణిస్తూ సస్పెన్షన్ వేటు వేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా పరిషత్ సీఈఓ గోవింద్, మెప్మా పీ.డీ రాములు, డీ ఈ ఓ దుర్గాప్రసాద్, కార్మిక శాఖ అధికారి యోహాన్, డీపీవో జయసుధ, ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్స్ ఏ.డీ సమ్మయ్య, ఈఈ దేవిదాస్, హన్మంత్ రావు తదితరులు పాల్గొన్నారు.