నిజామాబాద్, అక్టోబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహరహం శ్రమిస్తూ అసువులు బాసిన పోలీసు అమరవీరులకు జాతి యావత్తు రుణపడి ఉంటుందని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ, ఎంతో విలువైన ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలు మరువలేనివని శ్లాఘించారు.
పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు తో కలిసి పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఏ ప్రాంతంలోనైతే శాంతిభద్రతలు నెలకొని ఉంటాయో, ఆ ప్రాంతం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు సమర్ధవంతంగా అందాలంటే శాంతిభద్రతలు సజావుగా ఉన్నప్పుడే సాధ్యపడుతుందని అన్నారు. ఈ దిశగా అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసుల సేవలు, వారి త్యాగాలు అనన్యసామాన్యమైనవని కొనియాడారు. ఏ రకంగా చూసినా అన్ని ప్రభుత్వ శాఖలకు పోలీసు శాఖ వెన్నుముక వంటిదని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.
విధి నిర్వహణలో అసాంఘిక శక్తులతో పోరాడుతూ అమరులైన పోలీసు సిబ్బంది కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, సమాజంలోని అన్ని వర్గాల వారు సైతం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ, వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 17 మంది పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున మల్లారం గ్రామంలో మంజూరు చేసిన ఇళ్ల స్థలాల పట్టాలను కలెక్టర్ తన చేతుల మీదుగా అందజేశారు.
పోలీస్ కమిషనర్ కేఆర్. నాగరాజు మాట్లాడుతూ, ఈ ఏడాది దేశవ్యాప్తంగా 264 మంది పోలీసులు అమరులయ్యారని అన్నారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 1986 నుండి ఇప్పటివరకు 18 మంది పోలీసులు అసాంఘిక శక్తులతో పోరాడుతూ అసువులు బాశారని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా తమ కర్తవ్య నిర్వహణలో ఎల్లవేళలా పోలీసులు ముందంజలో నిలుస్తున్నారని అన్నారు.
జిల్లాలో అమరులైన పోలీసు కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం తరపున రెండు పడక గదుల ఇళ్లను మంజూరు చేయించేందుకు జిల్లా యంత్రాంగం చొరవ చూపాలని కలెక్టర్ ను ఈ సందర్భంగా కోరారు. అమరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లవేళలా చేదోడువాదోడుగా ఉంటుందని భరోసా కల్పించారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్డీఓ రవి, డీసీపీలు అరవింద్ బాబు, గిరిరాజ్, ఏసీపీలు వెంకటేశ్వర్లు, వి.శ్రీనివాస్, సీఐ లు, ఎస్.ఐలు, పోలీసు సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.