నిజామాబాద్, అక్టోబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి పండుగను ఆనందమయంగా జరుపుకోవాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు హితవు పలికారు. దీపావళి వేడుక నేపథ్యంలో కలెక్టర్ శనివారం రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, ఫైర్ తదితర శాఖల అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దీపావళి సందర్భంగా జిల్లాలో ఎక్కడ కూడా ప్రమాద ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయాలు జరిపితే, దుకాణాలను సీజ్ చేయాలని ఆదేశించారు. అన్నిచోట్ల విస్తృతంగా తనిఖీలు జరపాలని, ముఖ్యంగా నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ ఏరియాలలో బాణాసంచా విక్రయాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు.
మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, పోలీసు అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. అనుమతులు పొందిన దుకాణాదారులు సైతం తు.చ తప్పకుండా అన్ని నియమనిబంధనలు పాటించేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. బాణాసంచా దుకాణాల నడుమ కనీస దూరం ఉండేలా చర్యలు తీసుకోవాలని, అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణమే నష్టనివారణ చర్యలు చేపట్టేలా బాణాసంచా విక్రేతలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
ముఖ్యంగా సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడి బాణాసంచా అమ్మకాలు జరిగేలా, విక్రేతలు అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు. బాణాసంచా కాల్చే క్రమంలో అజాగ్రత్త వల్ల ప్రమాదం జరిగి ఎవరైనా ప్రాణాలు కోల్పోతే, శాశ్వత అంగవైకల్యానికి లోనైతే బాధిత కుటుంబానికి వాటిల్లే నష్టం పూడ్చలేనిదని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలోని ఏ ఒక్క ప్రాంతంలోనూ ప్రమాద సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఈ విషయంలో ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఆనందోత్సాహాల నడుమ దీపావళి వేడుక జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. సెల్ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.