నిజామాబాద్, అక్టోబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో వరి కోతలు ఊపందుకున్న దృష్ట్యా, అవసరమైన ప్రాంతాల్లో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు, తహసీల్దార్ లతో కలెక్టర్ మంగళవారం సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖరీఫ్‌లో సాగు చేసిన వరి పంట దిగుబడులు చేతికందుతున్న ప్రస్తుత తరుణంలో రైతుల సౌకర్యార్థం అవసరమైన చోట్ల ధాన్యం సేకరణ కేంద్రాలను తక్షణమే నెలకొల్పాలని కలెక్టర్ సూచించారు.
రైతులు పెద్ద ఎత్తున సాగు చేసిన వరి ధాన్యాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా విక్రయించుకునేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ధాన్యం లోడిరగ్, అన్‌లోడిరగ్ ప్రక్రియ వెంటదివెంట జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. గన్నీ బ్యాగుల కొరత తలెత్తకుండా రవాణా సమస్యలు ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
ఎవరైనా రైతును నష్టపర్చే, మోసగించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. రైతులు కూడా నాణ్యతా ప్రమాణాలకు లోబడి బాగా ఆరబెట్టి శుభ్రపర్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, తద్వారా పూర్తిస్థాయి మద్దతు ధర పొందవచ్చని కలెక్టర్ హితవు పలికారు.
ధాన్యం ‘ఏ’ గ్రేడ్ క్వింటాలు కు రూ.2060 చొప్పున, సాధారణ రకానికి రూ. 2040 గా ప్రభుత్వం కనీస మద్దతు ధరను నిర్ణయించిందని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో ధాన్యానికి మంచి డిమాండ్ ఉన్నందున రైతులు తొందరపడి మధ్యదళారులను ఆశ్రయించి మోసపోవద్దని కలెక్టర్ సూచించారు.