బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం ఎంతో మధురమైన ఘట్టమని, బాలలందరూ అందమైన బాల్యాన్ని స్వేచ్ఛగా ఆస్వాదించేలా చూడాల్సిన బాధ్యత సమాజంలోని మనందరిపై ఉందని వారు పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో బుధవారం జెడ్పి చైర్మన్‌ దాదన్నగారి విట్ఠల్‌ రావు అధ్యక్షతన జిల్లా బాలల పరిరక్షణ కమిటీ తొలి సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా జెడ్పి చైర్మన్‌ మాట్లాడుతూ, బాలల హక్కుల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ వంటి వాటిని ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు చేపట్టాలని, బాలలపై అకృత్యాలకు పాల్పడే వారిని ఉపేక్షించకూడదని అన్నారు. బాలలకు సంబంధించిన సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిష్కరించేందుకు చొరవ చూపాలని, సమస్య తీవ్రతను బట్టి జిల్లా కమిటీ దృష్టికి తేవాలని సూచించారు.

తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి చదువుకునే వయసు గల పిల్లలను కొంతమంది తల్లిదండ్రులు పనుల్లో చేర్పిస్తున్నారని, పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బాలలను తప్పనిసరిగా బడికి పంపి చదివించాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం బాలికలు, మహిళల రక్షణకు ప్రాధాన్యతను ఇస్తూ ప్రత్యేకంగా షీ టీమ్‌ లను ఏర్పాటు చేసిందని, తల్లిదండ్రులకు ఆడపిల్లలు భారం కాకూడదనే సదుద్దేశ్యంతో కల్యాణలక్ష్మి, షాదిముబారక్‌ పథకాల ద్వారా తోడ్పాటును అందిస్తోందని, కేసీఆర్‌ కిట్‌ను అమలు చేస్తోందని అన్నారు.

కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ, మండల, గ్రామ, వార్డు స్ధాయిలలోనూ వారం రోజుల వ్యవధి లోపు బాలల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేసుకుని క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్‌ అధికారులను ఆదేశించారు. అన్ని నివాస ప్రాంతాల్లోని 18 సంవత్సరాల లోపు బాలబాలికల పేర్లు, ఆధార్‌, తల్లిదండ్రుల పేర్లు, ప్రస్తుతం వారు ఏం చేస్తున్నారు అనే వివరాలను అంగన్వాడీ కార్యకర్తల ద్వారా పక్కాగా సేకరించాలన్నారు. బాలల పరిరక్షణ కమిటీలు సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తే బాలల హక్కులను కాపాడగల్గుతామని, ముఖ్యంగా బాలికలకు ఎంతో మేలు జరుగుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు.

అనేక ప్రయోజనాలను ఆశిస్తూ ఏర్పాటవుతున్న బాలల పరిరక్షణ కమిటీలు బాధ్యతాయుతంగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. బాలలపై నేరాలు జరగడానికి ఆస్కారం లేకుండా ముందస్తుగానే స్థానిక పరిస్థితులను నిశితంగా పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. రైల్వే స్టేషన్‌లు, బస్టాండ్‌లు, ఇతర ప్రదేశాల్లో ఉండే బాలలను గుర్తించి వారిని ఆనంద నిలయం వంటి వాటిలో చేర్పించాలని అన్నారు.

ఈ తరహా బాలల గుర్తింపు కోసం ప్రత్యేక బృందాలు వారం రోజుల పాటు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని ఆదేశించారు. బాల్య వివాహాలను అరికడుతూ, బాలికలపై లైంగిక వేధింపులను నిరోధించేందుకు, లింగ వివక్షతను పూర్తిగా పారద్రోలేందుకు అంకిత భావంతో కృషి చేయాలని ఆయా శాఖల అధికారులకు, బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు కలెక్టర్‌ సూచించారు. బాలల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం నిర్దేశించిన చట్టాలు తు.చ తప్పకుండా అమలయ్యేలా చూడాలన్నారు.

సమావేశంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి పద్మావతీ, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి సౌందర్య, జిల్లా పరిషత్‌ సీఈఓ గోవింద్‌, జిల్లా బాలల రక్షణ అధికారి చైతన్య, నిజామాబాద్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ సుదర్శనం, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »