నిజామాబాద్, అక్టోబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలిండియా సర్వీసెస్ ట్రైనీ అధికారుల బృందం తమ శిక్షణలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు వీలుగా ఈ నెల 31న నిజామాబాద్ జిల్లాకు చేరుకోనుంది. ఈ సందర్భంగా ఏర్పాట్ల విషయమై కలెక్టర్ సి.నారాయణ రెడ్డి గురువారం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు.
ట్రైనీ అధికారులతో కూడిన బృందాలు జిల్లాలోని దర్పల్లి మండలం దుబ్బాక, కోటగిరి మండలం ఎత్తుండ, ఆలూరు మండలం మిర్దాపల్లి, జక్రాన్ పల్లి మండలం మనోహరాబాద్, కమ్మర్పల్లి మండలం కోనసముందర్ గ్రామాల్లో ఈ నెల 31 నుండి నవంబర్ 5వ తేదీ సాయంత్రం వరకు బస చేసి ఆయా అంశాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తారని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ట్రైనీ అధికారులకు అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఎంపీడీవోలకు బాధ్యతలు పురమాయించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు, పల్లె ప్రగతి వంటి పథకాలతో పాటు వ్యవసాయం, విద్య, వైద్యం, మహిళా సంఘాల పనితీరు వంటి అంశాలను ఈ బృందాలు పరిశీలించనున్నందున అవసరమైన సమాచారం రూపొందించి సిధ్ధంగా ఉంచాలని జిల్లా అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి అధ్యయనం కోసం వస్తున్న శిక్షణ అధికారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ నెల 30 నాటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
సెల్ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జెడ్పి సీఈఓ గోవింద్, డీఆర్డీఓ చందర్, డీపీఓ జయసుధ, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుదర్శనం, ఏసీపీ లు, ఆర్డీఓ లు, వివిధ శాఖలకు చెందిన ఆయా మండలాల అధికారులు పాల్గొన్నారు.