నిజామాబాద్, అక్టోబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆటో మోటార్ రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నాగారం వద్దగల ఆర్టీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, ఆర్టీవో వెంకటరమణకి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు పది లక్షల మంది ఆటో అండ్ మోటారు రంగంలో పనిచేస్తున్నారన్నారు. పరోక్షంగా సుమారు 50 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా రంగ కార్మికులపట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. అధిక పన్నులు వేస్తూ, చలాన్ల రూపంలో వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆటో, మోటారు కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో మరియు మోటార్ కార్మికులకు డబుల్ బెడ్ రూమ్‌లు కేటాయించాలన్నారు. సెంట్రల్ మోటార్ వెహికల్ సవరణ బిల్లు 2019 ని రద్దు చేయాలన్నారు. అర్హులైన డ్రైవర్లకు వాహన కొనుగోలుకు ప్రభుత్వం గ్యారెంటీతో బ్యాంకు రుణాలు ఇవ్వాలన్నారు. ఆర్టిఏ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టాలని, దళారీ వ్యవస్థని రద్దు చేయాలన్నారు.
ప్రమాదాల్లో మరణించే డ్రైవర్లకు ప్రభుత్వం కల్పిస్తున్న 05 లక్షల బీమాను 10 లక్షల పెంచాలన్నారు. ప్రైవేటు ఫైనాన్సర్ల దోపిడిని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లను, ప్రయాణికులను మోసం చేస్తూ, దోపిడీ చేస్తున్న ఓలా, ఉబర్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు డి.గంగాధర్, ఐ.ఎఫ్.టి.యు జిల్లా నాయకులు టి. విఠల్, నాయకులు సంగయ్య, దశరథ్, నర్సింగరావు, రమేష్, రాజేందర్, రవి, అనిల్, మారుతి, రాంగోపాల్, గోపిగౌడ్, అబ్దుల్, సమీర్, కిషన్, గణేష్, సంతోష్, నారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు.