కామారెడ్డి, అక్టోబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ, జిల్లా పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
పోలీస్ సంస్మరణ దినోత్సవంలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆరోగ్యవంతులైన వ్యక్తులు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని సూచించారు. రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ ద్విచక్ర వాహన చోదకులు వాహనాలను నడపాలని కోరారు. పోలీసులు నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్నారని చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు ఎవరు రక్తం కొనుగోలు చేయవలసిన పరిస్థితి రాకుండా చూడాలన్నారు. పోలీసులు, యువకులు రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, డీఎస్పీ సోమనాథం, పోలీసులు, యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎం. రాజన్న, ప్రధాన కార్యదర్శి రఘు కుమార్, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, రెడ్ క్రాస్ ప్రతినిధులు జమీల్ అహ్మద్, డాక్టర్ బాలు, రమేష్ రెడ్డి, యువకులు, పోలీసులు పాల్గొన్నారు.