ప్రభుత్వ ప్రాధామ్యాలపై ఫీల్డ్‌ అసిస్టెంట్లకు శిక్షణ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్నకార్యక్రమాలపై ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌లకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఏపీఓలను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఏపీఓలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఈ.సీలతో కలెక్టర్‌ సెల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శనివారం మధ్యాన్నంలోగా క్షేత్ర సహాయకులకు శిక్షణ పూర్తి చేయాలన్నారు.

రోజువారీ సాధారణ విధులు నిర్వర్తిస్తూనే, హరితహారం, ఉపాధి హామీ కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించడం, తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్‌, మినీ బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు, హరితవనాలు, నర్సరీల ఏర్పాటుపై ఫీల్డ్‌ అసిస్టెంట్‌ లకు వారు నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతల గురించి శిక్షణ సందర్భంగా స్పష్టంగా తెలియజేయాలన్నారు. ఎక్కడైనా ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు లేనిపక్షంలో సీనియర్‌ మేట్లకు శిక్షణ ఇవ్వాలన్నారు.

జిల్లా వ్యాప్తంగా గల అన్ని రహదారులకు ఇరువైపులా ప్రతి మూడు మీటర్ల ఒకటి చొప్పున కనీసం ఆరు అడుగుల ఎత్తు కలిగిన మొక్క తప్పనిసరిగా ఉండాలని, మొక్కల నిర్వహణ, సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇన్స్టిట్యూషనల్‌ ప్లాంటేషన్‌ కు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి నాలుగు వందల మొక్కలకు ఒక వన సేవకుడిని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.

పల్లె ప్రకృతి వనాలలో, తెలంగాణ క్రీడా ప్రాంగణాల్లో, వైకుంఠ ధామాలు, కంపోస్ట్‌ షెడ్లు, ప్రభుత్వ కార్యాలయ ఆవరణలు, విద్యా సంస్థలు, విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు, పీహెచ్‌సీలు, అన్ని ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు పెంచుతూ పచ్చదనాన్ని పెంపొందించేలా ఫీల్డ్‌ అసిస్టెంట్లు నిరంతరం పరిశీలన జరిపేలా పర్యవేక్షణ చేయాలని ఏపీఓలను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రాధాన్యతతో కూడిన పనులను గుర్తిస్తూ కూలీలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలన్నారు.

గతేడాది కంటే ఎక్కువ సంఖ్యలో కూలీలు పనులకు హాజరయ్యేలా చూడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్దేశిత లక్ష్యం సాధించాల్సిందేనని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఫార్మేషన్‌ రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సోమవారం నుండి ప్రతి జీ.పీ పరిధిలో కనీసం రెండు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావాలని అన్నారు. అదేవిధంగా తెలంగాణా గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నవంబర్‌ 15 వ తేదీ లోగా పూర్తి చేయాలని గడువు విధించారు.

మొత్తం 660 క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి రావాలని అన్నారు. ప్రతి మండలంలో కనీసం నాలుగు మినీ బృహత్‌ పల్లె ప్రకృతి, ఒకటి బృహత్‌ పల్లె ప్రకృతి వనం పూర్తి చేయాలని, 107 హరిత వనాల్లో అవసరమైన చోట మొక్కలను నాటి, సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. 2023 – 2024 సంవత్సరానికి సంబంధించి నర్సరీలను నెలకొల్పేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. పై అంశాల గురించి ఫీల్డ్‌ అసిస్టెంట్లకు పూర్తి అవగాహన కల్పిస్తూ, వారు సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వర్తించేలా చూడాలన్నారు.

పీ.ఎం ఆది ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన పథకం పనులు తక్షణమే చేపట్టాలి

ఇదిలాఉండగా, ప్రధానమంత్రి ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన పథకం కింద జిల్లాకు రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరైనందున నిర్దేశిత ప్రాంతాల్లో పనులను తక్షణమే ప్రారంభించేలా చొరవ చూపాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులకు సూచించారు.

భీంగల్‌ మండలం రహత్‌ నగర్‌, కారేపల్లి, తాళ్లపల్లి, ఇందల్వాయి మండలం వెంగళపహాడ్‌, రంజిత్‌ నాయక్‌ తండా, మోపాల్‌ మండలం ఎల్లమ్మకుంట తండా, సిరికొండ మండలం పందిమడుగు, పాకాల, నవీపేట మండలం అబ్బాపూర్‌(బీ), వర్ని మండలం శంకోరా తండాలలో ఆయా పనులను వెంటనే ప్రారంభించి, సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, డీఆర్డీఓ చందర్‌, డీటీడబ్ల్యుఓ నాగూరావు, ఏ.పీ.డి సంజీవ్‌, ఆయా మండలాల ఏపీఓలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »