కామారెడ్డి, అక్టోబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం విద్యాశాఖ ఆధ్వర్యంలో జూనియర్ రెడ్ క్రాస్, యూత్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు పై సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రతి పాఠశాల నుంచి జూనియర్, యూత్ రెడ్ క్రాస్‌లలో విద్యార్థులను సభ్యులను ఉపాధ్యాయులు చేయించాలని సూచించారు.
సామాజిక కార్యక్రమాలలో విద్యార్థులను భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎం. రాజన్న మాట్లాడారు. 2019 లో జూనియర్, యూత్ రెడ్ క్రాస్ సభ్యులను అధిక మందిని చేయించి కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. సహకరించిన జిల్లా విద్యాశాఖ అధికారులకు, మండల విద్యాశాఖ అధికారులకు, ప్రధానోపాధ్యాయులకు ధన్యవాదాలు చెప్పారు.
ఈ సందర్భంగా అత్యధిక సభ్యత్వ నమోదు చేసిన పాఠశాలలకు ధ్రువీకరణ పత్రాలను జిల్లా కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సంజీవరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రఘుకుమార్, రెడ్ క్రాస్ కామారెడ్డి డివిజన్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, సమన్వయకర్తలు పాల్గొన్నారు.