కామారెడ్డి, అక్టోబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు చేపలు, రొయ్యలు పెంచే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉపాధి హామీ పనుల పురోగతి పై మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రైతులు ఉపాధి హామీ ద్వారా చేపల, రొయ్యల పెంపకం కోసం ఊట కుంటలు ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. ఉపాధి హామీ ద్వారా పంట పొలాలకు ఫార్మేషన్ రోడ్లు వేయించాలని కోరారు. కూలీలకు ఉపాధితో పాటు రైతులకు పంట పొలాలకు వెళ్లడానికి దారి ఏర్పడుతుందని తెలిపారు. ఉపాధి హామీ కూలీలతో పంట కాలువల నిర్మాణం, కంపోస్ట్ గుంతలు, ఉట చెరువులు ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా చూడాలన్నారు. జాబ్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకున్న కూలీలకు తక్షణమే జాబు కార్డులను ఇవ్వాలని సూచించారు. సమావేశంలో డిఆర్డిఓ సాయన్న, ఉపాధి హామీ ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు, అధికారులు పాల్గొన్నారు.