నిజామాబాద్, అక్టోబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనుల్లో నాణ్యతా లోపాలకు తావులేకుండా పక్కాగా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వెంగళ్ రావు నగర్‌లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఉర్దూ మీడియం), వినాయక్ నగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలను కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
బడులలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు మన ఊరు – మన బడి కింద చేపట్టిన పనులను పరిశీలించారు. నూతన గదులు, కిచెన్, సంప్ నిర్మాణాలు, ఫ్లోరింగ్, రెయిలింగ్, వాటర్ పైప్ లైన్ కనెక్షన్లు, విద్యుద్దీకరణ తదితర పనులను పరిశీలన జరిపారు. చిన్న చిన్న లోపాలను గుర్తించిన కలెక్టర్, వాటిని సరి చేయించాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎంతమాత్రం రాజీపడకూడదని, నాసిరకంగా పనులు జరిపిస్తే మన ఊరు – మన బడి కార్యక్రమం లక్ష్యం దెబ్బతింటుందని అన్నారు.
పెండిరగ్ పనులను సత్వరమే పూర్తి చేయించేందుకు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఏ చిన్న పనిని కూడా అసంపూర్తిగా విడిచిపెట్టకూడదని, నిర్దేశించిన ఫలితం పూర్తి స్థాయిలో సిద్దించేలా పనులు పూర్తి చేయించాలని కలెక్టర్ హితవు పలికారు. గోడలపై పగుళ్లకు మరమ్మతులు చేసిన పిదపనే పెయింట్ వేయించాలని అన్నారు. కలెక్టర్ వెంట ఈ.ఈ దేవిదాస్, డీ.ఈ అంజిరెడ్డి, ఏ.ఈ ఉదయ్ కిరణ్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు భూమయ్య, గంగాధర్ తదితరులు ఉన్నారు.