బోధన్, అక్టోబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భవన నిర్మాణ కార్మికులకు 58 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి 500 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కోటగిరి మండల కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎ. విటల్ గౌడ్ అధ్యక్షత వహించగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య హాజరై మాట్లాడారు.
భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వంపై ఆధారపడకుండా పోరాడి భవన నిర్మాణ సంక్షేమ బోర్డును సాధించుకోవడం జరిగిందని, బోర్డు ద్వారా 10 లక్షల రూపాయల పైబడి భవన నిర్మాణాలు చేసే వారి నుండి ఒక శాతం సెస్సు రూపంలో వసూలు చేసి సంక్షేమ బోర్డులో జమ చేసిన డబ్బులను కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించుకోవడం జరుగుతుందని అన్నారు.
ప్రధానంగా కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే 6 లక్షలు, సహజ మరణం పొందుతే 30 వేలు, పిల్లల పెళ్లిళ్లకు చదువులకు కాన్పులకు 1లక్ష 30 వేలు ఇప్పించడం జరుగుతుందన్నారు అంతే కాకుండా 58 సంవత్సరాల నిండిన కార్మికులకు 5వేల రూపాయలు తగ్గకుండా పెన్షన్ సాధించుకోవడం తోపాటు యాక్సిడెంట్ పరిహారం కింద పది లక్షల రూపాయలు, సహజ మరణానికి మూడు లక్షల రూపాయలు, వివాహ ఖర్చుల కింద లక్ష రూపాయలు సాధించుకోవడానికి కార్మికుల పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం బాన్సువాడ నియోజకవర్గ కార్యదర్శి దుబాస్ రాములు మాట్లాడుతూ కోటగిరిలో ఏఐటీయూసీ బలోపేతానికి కార్మికులందరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటియుసి మండల నాయకులు నల్ల గంగాధర్, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షులు పెద్ద నాగిరెడ్డి, నాయకులు అన్వర్, మతిన్, మహమ్మద్ అలీ, బాలయ్య జావీద్ తదితరులు పాల్గొన్నారు.