నిజామాబాద్, అక్టోబర్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 72 ఫిర్యాదులు అందాయి.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జెడ్పి సీఈఓ గోవింద్‌లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండిరగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
టీ.డీ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించాలి
ప్రజావాణి అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, నవంబర్ 7 వ తేదీ నుండి 19 వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న టీ.డీ (టిటనస్, డిప్తీరియా) వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సాధించేందుకు సంబంధిత శాఖల అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. పది, పదిహేను సంవత్సరాల వయస్సు గల బాలబాలికలకు వివిధ రకాల వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ఈ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, వసతి గృహాలు, సంక్షేమ బడులు, కేంద్రీయ విద్యాలయాలు, మదరసాలు తదితర విద్యా సంస్థల్లో చదువుతున్న ఐదు, పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులందరికీ తప్పనిసరిగా డీ.టీ వ్యాక్సినేషన్ ఇచ్చేలా వైద్యారోగ్య శాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ ఆదేశించారు.
నవంబర్ 4 వ తేదీ నాటికే విద్యార్థులందరి సమగ్ర వివరాలను సేకరించి, ప్రతి ఒక్కరికి నిర్ణీత గడువులోగా డీ.టీ వ్యాక్సిన్ అందించేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా ధాన్యం సేకరణ కేంద్రాలు, మన ఊరు – మన బడి పనులు, హరితహారం కార్యక్రమాలకు ప్రాధ్యాన్యత ఇవ్వాలని అన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జెడ్పి సీఈఓ గోవింద్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుదర్శన్, డీఈఓ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.