నిజామాబాద్, అక్టోబర్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత దేశపు ఐక్యతకు చిహ్నంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ చరిత్రలో చిర స్థాయిలో నిలిచిపోతారని ఏసిపి వెంకటేశ్వర్లు అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఐక్యతా పరుగును 7వ పోలీసు బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాసరావుతో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడి ఉన్న మన దేశాన్ని ఒక్కటి చేసి భారత దేశ అస్థిత్వాన్ని కాపాడిన మహనీయుడు సర్దార్ పటేల్ అని, ఎన్నో ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కొని ఉక్కు మనిషిగా పేరుగాంచారని తెలిపారు. వల్లభాయ్ పటేల్ లేకపోతే ఈ దేశం యొక్క స్థితి ఇంకోలా వుండేదన్నారు. 7వ బెటాలియన్ కమాండెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ యువత దేశం యొక్క ఐక్యతా స్ఫూర్తితో ముందుకు సాగాలని, సమాజం పట్ల, దేశం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ సర్దార్ పటేల్ వల్లనే తెలంగాణ కు స్వాతంత్య్రం లభించిందని, నైజాం నుంచి తెలంగాణను విముక్తి చేసి భారతదేశంలో విలీనం చేయించింది సర్దార్ పటేల్ అని గుర్తు చేశారు. ఆయన జయంతి రోజున జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం గర్వకారణమని, ఈ సంవత్సరం మొత్తం తెలంగాణ స్వాతంత్య్ర విలీన వజ్రోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. ఐక్యతా పరుగులో ఉత్సాహంగా పాల్గొన్నవారందరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.
శివాజీ నగర్ శివాజీ విగ్రహం నుంచి ప్రారంభమైన ఐక్యతా పరుగు వర్ని చౌరస్తాలోని సర్దార్ పటేల్ విగ్రహం వరకు సాగింది, అనంతరం పటేల్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించి ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎన్‌సిసి అధికారులు ప్రసాద్, పోలీసులు, శ్రీ రామకృష్ణ విద్యాలయం విద్యార్థులు, యువతి యువకులు, నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు పాల్గొన్నారు.