నిజామాబాద్, అక్టోబర్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును నిశితంగా పరిశీలించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అఖిల భారత సర్వీసుల ట్రైనీ అధికారులకు సూచించారు. తమ శిక్షణలో భాగంగా క్షేత్ర స్థాయిలో వివిధ అంశాల అధ్యయనం కోసం నిజామాబాద్ జిల్లాకు కేటాయించబడిన అఖిల భారత సర్వీసుల ట్రైనీ అధికారుల బృందం సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో కలెక్టర్ తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా వారినుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా స్థితిగతులు, పాలనా స్వరూపం, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, వ్యవసాయం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, డివిజన్, జిల్లా స్థాయి కేంద్రాలుగా అధికార యంత్రాంగం పరిపాలన కొనసాగుతుందని వివరించారు. నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనందున 70 నుండి 80 శాతం మంది ప్రజలు సాగు రంగంపైనే ఆధారపడి జీవనాలు సాగిస్తారని అన్నారు.
నిజాంసాగర్, శ్రీరాంసాగర్, అలీసాగర్ వంటి జలాశయాలతో పాటు జిల్లాలో 70 కిలోమీటర్ల మేర పరీవాహక ప్రాంతం కలిగి ఉన్న జీవనది గోదావరిని ఆధారంగా చేసుకుని వివిధ రకాల పంటలు సాగు చేస్తారని ట్రైనీ అధికారులకు వివరించారు. అత్యధిక విస్తీర్ణంలో వరి పంట పండిస్తారని, 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం చేతికందుతుందని అన్నారు. ఫలితంగా నిజామాబాద్ జిల్లా వరి సాగులో రాష్ట్రంలోనే రెండవ స్థానంలో కొనసాగుతోందన్నారు.
అలాగే దేశంలోనే అత్యధికంగా పసుపు పంట సాగు కూడా ఈ జిల్లాలోనే సాగవుతుందని కలెక్టర్ తెలిపారు. సోయాబీన్, ఎర్రజొన్న, మొక్క జొన్న, ఇతర పప్పు దినుసులు వంటి పంటలను కూడా జిల్లా రైతాంగం పండిస్తుందని వివరించారు. సేద్యపు రంగానికి ప్రభుత్వం ఇతోధికంగా తోడ్పాటును అందిస్తోందని, దేశంలోనే మరెక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ను అమలు చేస్తోందని అన్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు అన్నదాతకు ఆదరువుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను పరిశీలిస్తే, పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రతి గ్రామంలో నిర్వహించబడుతోంది కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం కింద ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, కంపోస్ట్ షెడ్లు, నర్సరీలు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు హరితహారం వంటి కార్యక్రమాలు అమలవుతున్నాయని అన్నారు. వివిధ వర్గాల వారికి ఆసరా పథకం కింద పెద్ద ఎత్తున ఆర్ధిక సహాయం అందిస్తూ ప్రభుత్వం ఆలంబనగా నిలుస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు.
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులకు 2016 రూపాయల చొప్పున, దివ్యాన్గులకు 3016 రూపాయల చొప్పున పెన్షన్ అందిస్తోందన్నారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే సుమారు మూడు లక్షల మందికి ప్రతీ నెల ఆసరా పెన్షన్ల కింద 17 కోట్ల రూపాయలను పంపిణీ చేస్తోందని వివరించారు. గర్భిణీల కోసం కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకాలు ఎంతో సత్ఫలితాలు అందిస్తున్నాయని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు మన ఊరు – మన బడి కార్యక్రమం కింద పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తోందని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామంలోనూ ప్రజలకు ఉపయుక్తంగా నిలిచే అనేక రకాల పనులను చేపడుతూ, కూలీలకు ఉపాధి కల్పించడం జరుగుతోందన్నారు.
క్షేత్ర సందర్శనలో భాగంగా పంటల సాగు, యాజమాన్య పద్ధతులు, ఉపాధి హామీ, మన ఊరు – మన బడి తదితర కార్యక్రమాల అమలు తీరును నిశితంగా పరిశీలించి ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాలపై అవగాహన పెంపొందించుకోవాలని, ఆయా పథకాల వాస్తవ అమలు పరిస్థితిని క్షేత్ర స్థాయి అధ్యయనం అనంతరం తమ దృష్టికి తేవాలని కలెక్టర్ సూచించారు.
ఎలాంటి సందేహాలు, సహాయ సహకారాలు అవసరమైనా, నేరుగా అధికారులను సంప్రదించవచ్చని అన్నారు. ఈ భేటీలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నోడల్ ఆఫీసర్ వసుంధర, జెడ్పి సీఈఓ గోవింద్, డీఆర్డీఓ గోవింద్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, ట్రైనీ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.