భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలపై తక్షణ చర్యలు చేపట్టాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఇసుక, మొరం అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు, రేషన్‌ బియ్యం స్మగ్గ్లింగ్‌ నిరోధానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ పై అంశాలపై పోలీస్‌ కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, బి.చంద్రశేఖర్‌ లతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

నెల రోజుల క్రితం నిర్వహించిన జిల్లా స్థాయి ఎన్‌ ఫోర్సుమెంట్‌ కమిటీ సమావేశం అనంతరం ఆయా ప్రాంతాలలో అక్రమ రవాణా, అక్రమ నిర్మాణాల విషయమై చేపట్టిన చర్యల గురించి రెవెన్యూ డివిజన్‌, మున్సిపాలిటీల వారీగా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేకుండా ఏ ఒక్క ఇసుక, మొరం వాహనం సైతం తిరగడానికి వీలు లేదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి నిర్ణీత రుసుము చెల్లించి సులభంగా ఇసుక, మొరం పొందేందుకు వీలుగా స్థానిక తహసీల్దార్లకు తాత్కాలికంగా అనుమతులు మంజూరు చేసే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.

నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకంగా అనుమతులను జారీ చేయాలని, ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా సంబంధిత అధికారిని బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్‌ హెచ్చరించారు. ఇప్పటికే అనుమతులు పొంది అధికారికంగా జిల్లాలో కొనసాగుతున్న క్వారీలన్నీ తహసీల్దార్లు, ఎస్‌ హెచ్‌ ఓ ల పర్యవేక్షణలోనే కొనసాగాలని స్పష్టం చేశారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే క్వారీల నుండి ఇసుక, మొరం రవాణా జరగాలని, సెలవు రోజుల్లో తవ్వకాలు జరుగకుండా చూడాలన్నారు.

అదేవిధంగా, పీడీఎస్‌ రైస్‌ అక్రమ రవాణాను నిరోధించేందుకు మరింత గట్టిగా కృషి చేయాలని సూచించారు. పీడీఎస్‌ రైస్‌ ను రేషన్‌ కార్డుదారులు ఎవరైనా బ్లాక్‌ మార్కెట్‌ కు తరలించే వ్యక్తులకు విక్రయించినట్లు తేలితే అలాంటి వారిపై కూడా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే రేషన్‌ కార్డును రద్దు చేస్తామని కలెక్టర్‌ హెచ్చరించారు. రేషన్‌ బియ్యం అవసరం లేకపోతే తీసుకోకూడదని కార్డు హోల్డర్లకు హితవు పలికారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా గట్టి నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. కాగా, అక్రమ నిర్మాణాలను ఎంతమాత్రం ఉపేక్షించకుండా ఫిర్యాదులు అందిన వెంటనే క్షేత్ర స్థాయిలో పరిశీలన జరపాలని ఎన్‌ ఫోర్సుమెంట్‌ కమిటీలకు సూచించారు. టీఎస్‌-బిపాస్‌ ద్వారా అనుమతులు తీసుకోకుండా చేపడుతున్న నిర్మాణాలను వెంటనే నిలిపివేయించాలని ఆదేశించారు. అలాగే అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతుంటే, వాటిని కూడా నిలిపివేయించి మున్సిపల్‌ కమిషనర్లకు క్షేత్రస్థాయి పరిశీలనకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

ఈ విషయంలో తహసీల్దార్లు, ఎస్‌.హెచ్‌.ఓ లు క్రియాశీలక పాత్ర పోషించాలని కలెక్టర్‌ సూచించారు. టీఎస్‌-బిపాస్‌ అనుమతులు పొంది, అందుకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపినట్లయితే వాటిని సరి చేసుకునేందుకు వీలున్న సందర్భాల్లో నిర్మాణదారులకు రాతపూర్వక హామీతో నిర్ణీత సమయం వరకు గడువు ఇవ్వవచ్చని తెలిపారు. గడువులోపు అక్రమ నిర్మాణాలను సరిచేసుకోకపోతే వాటిని కూల్చివేయాల్సిందిగా ఎన్‌ ఫోర్సుమెంట్‌ కమిటీ సిఫార్సు చేయవచ్చని సూచించారు.

నివాసయోగ్యమైన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు పొంది, వాణిజ్యపరమైన నిర్మాణాలు చేపట్టడం పూర్తిగా నిబంధనల ఉల్లంఘనగానే పరిగణించబడుతుందని, ఈ తరహా నిర్మాణాలపైనా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. వారం రోజుల్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించిన అన్ని ఫిర్యాదులపై చర్యలు చేపట్టాలని గడువు విధించారు.

టీఎస్‌-బిపాస్‌ చట్టం పట్ల ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు విస్తృత స్థాయిలో కృషి చేయాలన్నారు. కాగా, ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, భూముల పరిరక్షణ కోసం ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సులో సంబంధిత శాఖల అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్దీవోలు, తహసీల్దార్లు, ఎస్‌ఎచ్‌ఓలు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »