నిజామాబాద్, నవంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యానికి ఎలాంటి తరుగు, కోతలు లేకుండా రైతుకు పూర్తి స్థాయిలో మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాణ్యతతో కూడిన ధాన్యానికి ఎవరైనా కడ్తా తీస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కడ్తా అమలు చేసే రైస్ మిల్లులను సీజ్ చేసేందుకు వెనుకాడబోమని తేల్చి చెప్పారు.
బోర్గాం (పీ), మోపాల్, నర్సింగ్ పల్లి, కాస్బాగ్ తండా, బాడ్సి గ్రామాల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. గన్నీ బ్యాగులు, తేమ కొలిచే యంత్రాలు, వేయింగ్ మెషీన్లు సరిపడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. అధిక సంఖ్యలో హమాలీలను నియమించి, వెంటదివెంట ధాన్యం లోడిరగ్, అన్‌లోడిరగ్ ప్రక్రియ జరిగేలా పక్కా ప్రణాళికతో పర్యవేక్షణ జరపాలని అన్నారు.
ఆరుగాలం శ్రమించి పంట సాగు చేసిన అన్నదాతలు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధానంగా ఎఫ్.ఏ.క్యూ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ధాన్యానికి ఎలాంటి తరుగు లేకుండా రైతులు కనీస మద్దతు ధర పొందేలా చూడాలన్నారు. రైతులు కూడా బాగా ఆరబెట్టి శుభ్రపర్చిన ధాన్యాన్ని కేంద్రాలకు తేవాలని, తద్వారా పూర్తి స్ధాయి మద్దతు ధర పొందవచ్చని కలెక్టర్ హితవు పలికారు.
ఆరబెట్టిన, శుభ్రపర్చిన ధాన్యాన్ని, నాసిరకం ధాన్యంతో కలుపకుండా వేరు చేసి విక్రయించాలని సూచించారు. దీనివల్ల ఎలాంటి తరుగు, కడ్తా లేకుండా పూర్తి ధర పొందవచ్చని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీసీఓ సింహాచలం, డీఎస్‌ఓ చంద్రప్రకాశ్, మోపాల్ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో లింగం తదితరులు ఉన్నారు.