నిజామాబాద్, నవంబర్ 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గర్భిణీ మహిళల వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యాధికారులు, సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణీల వివరాలను రిజిస్ట్రేషన్ చేయడంలో అలసత్వం కనబర్చిన మెండోరా పీహెచ్‌సి హెల్త్ సూపర్వైజర్ మీరమ్మపై సస్పెన్షన్ వేటు వేశారు. పీహెచ్‌సి వైద్యాధికారిని సంజాయిషీ కోరాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇదే అంశంపై చౌటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్, సూపర్వైజర్‌లకు మెమోలు జారీ చేయించారు. అలాగే, ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడంలో వెనుకబడిన పోచంపాడ్, కిసాన్ నగర్, నందిపేట, పోచంపల్లి, వినాయకనగర్, చంద్రశేఖర్ కాలనీ, కమ్మర్పల్లి తదితర పీహెచ్‌సిల వైద్యాధికారులకు కూడా మెమోలు జారీ చేయాలని ఆదేశించారు.
జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రగతిపై కలెక్టర్ గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యాధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. గర్భిణీల రిజిస్ట్రేషన్ జిల్లాలో సగటున 91 శాతం జరిగినప్పటికీ, మెండోరా, చౌటుపల్లి, వేల్పూర్ పీహెచ్‌సిల పరిధిలో నలభై శాతానికి లోబడి మాత్రమే వివరాలు నమోదు చేయడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు.
మెండోరా హెల్త్ సూపర్‌వైజర్‌ను సస్పెండ్ చేస్తూ, వైద్యాధికారికి సంజాయిషీ కోరారు. చౌటుపల్లి పీ హెచ్ సి వైద్యాధికారి, సూపర్వైజర్లకు మెమోలు జారీ చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుదర్శన్‌ను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి పీహెచ్ సి పరిధిలో 90 శాతానికి పైగా గర్భిణీల వివరాల నమోదు ఆన్‌లైన్లో జరగాలని స్పష్టం చేశారు. గర్భిణీలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరుపుతూ, రక్త నమూనాలను సేకరించి మధ్యాన్నం రెండు గంటల లోపే జిల్లా జనరల్ ఆసుపత్రిలోని డీ.హబ్ కు చేరేలా చూడాలన్నారు.
నూటికి నూరు శాతం ప్రసవాలన్నీ ప్రభుత్వాసుపత్రుల్లోనే జరిగేలా ప్రతి ఒక్కరు పరస్పర సమన్వయంతో గట్టిగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. గత అక్టోబర్ నెలలో జిల్లాలో సగటున 54 శాతం కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగాయని, ఇంకనూ పరిస్థితి మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల రేటును పెంపొందించడంలో వెనుకబడిన పీహెచ్ సిల వైద్యాధికారులను కారణాలు ఆరా తీస్తూ నిలదీశారు.
ప్రస్తుతం మెమోలు జారీ చేస్తున్నామని, ఈ నెలాఖరు నాటికి పనితీరులో మార్పు కనిపించకపోతే సస్పెన్షన్ వేటు తప్పదని కలెక్టర్ కరాఖండీగా తేల్చి చెప్పారు. కాగా, ప్రసవాల కోసం గర్భిణీలను నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్పించిన మీదట పలువురు అర్ధాంతరంగా ప్రైవేట్ హాస్పిటళ్ళకు తరలివెళ్లి కాన్పులు చేయించుకున్న ఉదంతాలను కలెక్టర్ ప్రస్తావిస్తూ, అందుకు గల కారణాల గురించి సంబంధిత వైద్యాధికారులు, ఏ.ఎన్.ఎంలను ఆరా తీశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరిన వారిని ఎవరైనా ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ల వైపు మళ్లించినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గర్భిణీలకు, వారి కుటుంబ సభ్యులకు గట్టి భరోసా కల్పిస్తూ, మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వాసుపత్రులపై నమ్మకాన్ని పెంపొందించాలని హితవు పలికారు. ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నందున, ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవల్లో పోటీ పడాలని సూచించారు.
నొప్పి లేకుండా కాన్పు చేసే విధానం జీ.జీ.హెచ్ లో అందుబాటులోకి వచ్చినందున, ఈ విషయాన్ని గర్భిణీలకు తెలియజేస్తూ వారు దీనిని సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. గర్భిణీలను ప్రసవాల కోసం ఆసుపత్రులకు తీసుకువచ్చే ఆశా కార్యకర్తలు, ఏ.ఎన్.ఎంలకు తగిన గౌరవం ఇస్తూ, గర్భిణీ ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలన్నారు. అయితే నిజామాబాద్ జీజీహెచ్, ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రుల్లో గర్భిణీలను కాన్పు కోసం తీసుకెళ్లిన సమయంలో తమ పట్ల కొందరు సిబ్బంది అనుచితంగా వ్యవహరించారని బాధిత ఆశా కార్యకర్తలు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
దీనిని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు. బాధ్యులైన సిబ్బందిని గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించారు. ఆసుపత్రుల్లో అనుచితంగా వ్యవహరించే సిబ్బందిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని, బాధ్యులను ఉద్యోగం నుండి తొలగిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్ హెచ్చరిక చేశారు. వీడియో కాన్ఫరెన్సులో డీఎంహెచ్‌ఓ సుదర్శన్, పీ.ఓ అంజన, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, గైనకాలజిస్ట్ డాక్టర్ నీలిమ తదితరులు పాల్గొన్నారు.