కామారెడ్డి, నవంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్లో ప్లాట్లు, గృహాలు కొనుగోలు చేసి ప్రజలు తమ సొంత ఇంటికలను నెరవేర్చుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం ఫ్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడారు. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఈ ధరణి టౌన్షిప్ ఉందన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఇండ్ల నిర్మాణానికి ఈ స్థలం అనుకూలంగా ఉందని తెలిపారు.
జిల్లా ప్రజల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేలంలో పాల్గొనే వ్యక్తులు రూ. 10 వేలు కలెక్టర్ కామారెడ్డి పేరు పై డిడి చెల్లించాలన్నారు. వేలంలో పాల్గొనే వ్యక్తులు తమ వెంట ఆధార్, పాన్ కార్డు , బ్యాంకు ఖాతా వంటి గుర్తింపు పత్రాలు తీసుకురావాలని సూచించారు. ఉద్యోగులకు బ్యాంకుల ద్వారా ప్లాట్లు, గృహాల కొనుగోలుకు రుణ సదుపాయం కల్పిస్తామని తెలిపారు.
జాతీయ రహదారి 44 నెంబర్ సమీపంలో అడ్లూరు శివారులో ధరణి టౌన్షిప్లో ప్లాట్లు, గృహాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నవంబర్ 14 నుంచి 18 వరకు వేలం పాట నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి వేలం ప్రారంభమవుతుందని తెలిపారు. ధరణి టౌన్షిప్లు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు. మొదటి, రెండవ విడతలలో ప్లాట్లు కొనుగోలుకు ప్రజలు సహకారం అందించారని తెలిపారు. సమావేశంలో ధరణి టౌన్షిప్ జోనల్ మేనేజర్ రాందాస్, ఏవో రవీందర్, అధికారులు పాల్గొన్నారు.