మున్సిపల్‌ కార్మికులకు వేతనాలు పెంచాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ కార్మికులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇస్తున్నట్టుగానే నెలకు 26 వేల రూపాయల వేతనం ఇవ్వాలని, కాంటాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులని పర్మినెంట్‌ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, మున్సిపల్‌ మేనేజర్‌, ఎం.హెచ్‌.ఓలకు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఐ.ఎఫ్‌.టి.యు జిల్లా ప్రధానకార్యదర్శి ఎం. సుధాకర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 13 కార్పొరేషన్లలో 128 మున్సిపాలిటీలలో సుమారు 60 వేల మంది కార్మికులు శానిటేషన్‌, ఇతర పనులు చేస్తున్నారన్నారు. వారికి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ జిహెచ్‌ఎంసిలో నెలకు 19వేలు ఇస్తూ, రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలలో కేవలం 15 వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మున్సిపల్‌ కార్మికులు అత్యంత దుర్గందపూరిత వాసనలో, ప్రమాదకరమైన గ్యాస్‌ విడుదలతో పనిచేస్తున్నారని, డ్రైనేజీలో దిగి ప్రాణాలు పోతున్నాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మున్సిపల్‌ కార్మికులు దేవుళ్ళని కితాబులు ఇస్తే, దేశ ప్రధాని మున్సిపల్‌ కార్మికులను సత్కరిస్తూ, శాలువాలు కప్పి పొగడ్తల్లో ముంచెత్తారే తప్ప, మున్సిపల్‌ కార్మికులకు తగిన విధంగా జీతాలు పెంచలేదని ఆరోపించారు.

ఒకవైపు తెలంగాణ ధనిక దేశం అని చెపుతూ ఏపీలో మున్సిపల్‌ కార్మికులకు నెలకు 21 వేలు, ఇతర అలవెన్సులతో ఐదు వేలు మొత్తం కలిపి 26 వేలు చెల్లిస్తుంటే ధనిక రాష్ట్రంలో మాత్రం మున్సిపల్‌ కార్మికుల పరిస్థితి ఈనాటి దీనంగా ఉందన్నారు. కావున తెలంగాణ మున్సిపల్‌ కార్మికులకు నెలకు 26 వేల రూపాయలు పెంచాలని వారు డిమాండ్‌ చేశారు.

ఒకపక్క ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు లేకపోవడంతో కొనుగోలు శక్తి పడిపోతుందని వారు విమర్శించారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలని, ఎన్‌.ఎం.ఆర్‌ కార్మికులకు పేస్కేల్‌ అమలు చేయాలని, మున్సిపల్‌ కార్మికులందరికీ డబుల్‌ బెడ్‌ రూములు ఇవ్వాలని, జిల్లా కేంద్రంలో ఈఎస్‌ఐ హాస్పిటల్‌ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

పై డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా యూనియన్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు కే. రాజేశ్వర్‌, గోవర్థన్‌, శివకుమార్‌, కిరణ్‌, కళావతి, రజిని, యాదమ్మ, శాంతికుమార్‌, గోవర్ధన్‌, తిరుపతి, సైదులు, రాజమల్లు, గంగాధర్‌, నర్సయ్య, సుజాత, లక్ష్మి, భరత్‌, నాగేశ్వర్‌, లక్ష్మమ్మ, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »