నిజామాబాద్, నవంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్దీకరణ (పీఎంఎఫ్‌ఎంఈ) పథకం కింద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతోధికంగా తోడ్పాటును అందిస్తున్నాయని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఔత్సాహికులు ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
యూనిట్ల స్థాపన కోసం వ్యక్తిగతంగానే కాకుండా స్వయం సహాయక సంఘాలకు, ఎఫ్‌పీఓలకు, కో-ఆపరేటివ్ సొసైటీలకు ఈ పథకం కింద సబ్సిడీతో కూడిన రుణ సదుపాయం పొందవచ్చని సూచించారు. యూనిట్ విలువలో లబ్ధిదారుడు పది శాతం మొత్తాన్నితన వాటా కింద సమకూరిస్తే, 35 శాతం ప్రభుత్వ సబ్సిడీ వర్తిస్తుందని వివరించారు. యూనిట్ల స్థాపనకై పది కోట్ల రూపాయల వరకు రుణం పొందవచ్చని తెలిపారు.
ఆహార శుద్ధి వ్యక్తిగత యూనిట్లలో గరిష్టంగా పది లక్షల వరకు సబ్సిడీ ఉంటుందని, గ్రూప్ గా ఏర్పడి యూనిట్ ను నెలకొల్పితే మూడు కోట్ల వరకు సబ్సిడీ పొందవచ్చని అన్నారు. అంతేకాకుండా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్(ఏ.ఐ.ఎఫ్) కింద ఋణం పొందిన వారికి వడ్డీ రాయితీ వర్తిస్తుందని, సీజీటీఎంసీ బీమా అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు ఆసక్తి, అర్హతలు కలిగిన వారు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ జిరాక్స్ ప్రతులతో జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయంలో జిల్లా మేనేజర్ సమ్మయ్యను కానీ, డీఆర్పీ యశ్వంత్ లను సంప్రదించాలని సూచించారు.
నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతం అయినందున ఆసక్తి కలిగిన వారు, ముఖ్యంగా రైతులు, యువకులు, స్వయం సహాయక సంఘాల వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఆహార శుద్ధి యూనిట్లలో భాగంగా జిల్లాలో తృణధాన్యాల ప్రాసెసింగ్, డెయిరీ ప్రొడక్ట్స్, పండ్లు – కూరగాయల ప్రాసెసింగ్, మాంసం-చేప ఉత్పత్తుల ప్రాసెసింగ్, మిల్లెట్ ప్రాసెసింగ్, నూనె గింజల ప్రాసెసింగ్, పల్స్ ప్రాసెసింగ్, పసుపు శుద్ధి, ఆర్టీఈ-ఆర్టీసీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పేందుకు అవకాశం ఉందని సూచించారు.
వ్యక్తిగత, గ్రూప్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ స్థాపించదల్చిన వారు తమ ప్రతిపాదనలను వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి దాఖలు చేయాలన్నారు. ఇతర కాంపోనెంట్స్ కు సంబంధించిన సమాచారం తెలుసుకోగోరేవారు వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.