నిజామాబాద్, నవంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిక్కు మతస్థుల ఆది గురువు అయిన గురునానక్ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని గాజుల్ పేట్ లో గల గురుద్వారాలో మంగళవారం నిర్వహించిన గురునానక్ జయంతి వేడుకల్లో జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. గురుద్వారాను సందర్శించిన కలెక్టర్ ను సిక్కు మతపెద్దలు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. కలెక్టర్ వారితో కలిసి ప్రార్థనల్లో పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సర్వ మతాల సారం ఒక్కటేనని అన్నారు. మత గురువులు, మహనీయుల జీవితాలు అందరికీ ఆదర్శనీయమని, వారు సూచించిన మార్గంలో పయనిస్తూ తోటి వారికి సహాయపడితే మహనీయులకు మనం నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందన్నారు.
కులమత, రాజకీయాలకు అతీతంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయని, దైవం ముందు అందరూ సమానులేనని పేర్కొన్నారు. గురునానక్ జయంతి సందర్భంగా జిల్లాలోని సిక్కు సోదరులందరికి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ వెంట సిక్కు మత పెద్దలు సర్దార్ దర్శన్ సింగ్, సర్దార్ కృపాల్ సింగ్, సర్దార్ రాజేందర్ సింగ్, సర్దార్ గోవింద్ సింగ్, సర్దార్ అజయ్ సింగ్ తదితరులు ఉన్నారు.