నిజామాబాద్, నవంబర్ 8
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా, నగర ప్రజలకు ప్రజలకు ప్రభుత్వం సువర్ణావకాశం కల్పిస్తోందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. సొంత ఇంటి కలను ధాత్రి టౌన్ షిప్‌లో ప్లాట్ కొనుగోలు చేసి సాకారం చేసుకునే అరుదైన అవకాశాన్ని ప్రజల చెంతకు తెచ్చిందన్నారు. నిజామాబాద్ నగరానికి అతి చేరువలో మల్లారం వద్ద జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పరంగా నెలకొల్పడిన ధాత్రి టౌన్ షిప్‌లో కారు చౌక ధరలకే నివాస స్థలాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని అనుమతులు, డీటీసీపీ అప్రువుడ్ లేఅవుట్ కలిగిన ధాత్రి టౌన్ షిప్‌లో ఇంటి స్థలం కొనడం అంటే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవడమేనని కలెక్టర్ భరోసా కల్పించారు. మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటు ధరకే ‘ధాత్రి’లో ఇంటి స్థలంకొనే సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఉద్యోగులు, వ్యాపారులు, ఎన్‌ఆర్‌ఐలకు సులభ వాయిదాల వెసులుబాటుతో రుణ సదుపాయం కల్పించేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఐదు, పది సంవత్సరాల కాలపరిమితితో తక్కువ మొత్తం నెలవారీ కిస్తులు చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నాయని అన్నారు. సకల సదుపాయాలతో సర్వాంగ సుందరంగా మోడల్ టౌన్ షిప్ రూపుదిద్దుకుంటోందని, పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు.
సువిశాలమైన 60 ఫీట్ల అప్రోచ్ రోడ్డు, 30 నుండి 40 ఫీట్ల విస్తీర్ణంతో కూడిన అంతర్గత రోడ్లు, ప్రభుత్వ పరంగానే నీటి వసతి, విద్యుత్ సరఫరా, సి.సి డ్రెయిన్లు, ఎస్.టీ.పి, టౌన్ షిప్ చుట్టూ ప్రహరీ నిర్మాణం జరిపిస్తున్నామని అన్నారు. ధాత్రి టౌన్ షిప్ నుండి కేవలం 9 కీ.మీ దూరంలో నిజామాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఉందని అన్నారు. 76 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో వివిధ సైజులలో మొత్తం 316 ప్లాట్లు టౌన్ షిప్ లో అందుబాటులోకి రానున్నాయని వివరించారు.
తొలి విడతలో 80 ప్లాట్ల అమ్మకాల కోసం ఈ నెల 14న ఉదయం 9 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్)లో బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ.ఎం.డి 10వేలు చెల్లించి బహిరంగ వేలంలో ఎవరైనా పాల్గొనవచ్చని, ఒకే ఈ.ఎం.డితో అన్ని ప్లాట్ల వేలంలోనూ పాల్గొనేందుకు అవకాశం (ఏదైనా ప్లాటును దక్కించుకునేంత వరకు) కల్పిస్తున్నామని తెలిపారు. వేలంలో ప్లాట్ రాని వారికి 10వేల రూపాయల ఈ.ఎం.డి వాపస్ చేయబడుతుందని తెలిపారు.
వేలంలో ప్లాట్ దక్కించుకున్న వారు 90 రోజుల వ్యవధిలో మూడు వాయిదాల్లో మొత్తం రుసుము చెల్లించేలా వెసులుబాటు ఉందని అన్నారు.ఒకే విడతలో మొత్తం రుసుము చెల్లించేందుకు ముందుకు వచ్చే వారికి ప్లాట్ ధరలో రెండు శాతం రిబేటు వర్తిస్తుందని వివరించారు. ధాత్రి టౌన్ షిప్ లో వివిధ సైజులలో ఉన్న ప్లాట్‌లను ఔత్సాహికులు సొంతం చేసుకునేందుకు 14న నిర్వహించనున్న బహిరంగ వేలంలో పాల్గొనాలని, ఉగ్యోగస్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు.
మరిన్ని వివరాల కోసం గ్రౌండ్ ఫ్లోర్, నూతన కలెక్టరేట్ కార్యాలయము నందు ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్‌షిప్ ఆఫీసులో సంప్రదించాలన్నారు. ఫోన్ నంబర్ – 74166 59599