కామారెడ్డి, నవంబర్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఎన్‌ఎస్‌ఎస్, రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఎన్నికల అక్షరాస్యత క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రభుత్వ మూడు నెలలకు ఒకసారి కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. గ్రామాల్లో 18 ఏళ్ల నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేయడానికి విద్యార్థులు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఓటర్ గా నమోదైన ప్రతి ఒక్కరు వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల న్యాక్ లో ఎ గ్రేడ్ సాధించడానికి అధ్యాపకులు, విద్యార్థులు చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కిష్టయ్య, అధ్యాపకులు శంకర్, రాజ్ గంభీర్ రావు పాల్గొన్నారు.