రెంజల్, నవంబర్ 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని 17 గ్రామాలలో సామాజిక తనిఖీలు చేపట్టడం జరిగిందని డిఆర్డిఏ పిడి చందర్ నాయక్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సామాజిక తనిఖీ ప్రజావేదికను పిడి ఆధ్వర్యంలో నిర్వహించారు. మూడు సంవత్సరాల కాలంలో 17 గ్రామ పంచాయతీలకు గాను 9 కోట్ల 30 లక్షల పనులు చేపట్టినట్లు పిడి వెల్లడిరచారు.
సామాజిక తనిఖీ బృందం వారు గుర్తించిన తప్పిదాల గురించి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఉపాధి పనులలో చోటు చేసుకున్న లోపాలు, మాస్టర్ నిర్వహణలో జరిగిన తప్పిదాలను గుర్తించినట్టు తెలిపారు. తప్పిదాలకు చోటు ఇచ్చిన వారిపై, బాధ్యులపై రికవరికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బాధ్యులకు షోకాజ్ నోటీసులు సైతం పంపించడం జరుగుతుందన్నారు.
దాని ప్రకారం బాధ్యులు ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఖాతాకు రికవరీ డబ్బులను పంపించవలసి ఉంటుందని తెలిపారు. అతిపెద్ద స్థాయిలో అవకతవకులకు పాల్పడిన వారు ఎవరైనా ఉంటే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు చోటు చేసుకోకుండా ఉండటానికి సామాజిక తనిఖీలను చేపట్టడం జరుగుతుందని పిడి అన్నారు. సభలో విజిలెన్స్ అధికారి నారాయణ, ఎంపీడీవోలు శంకర్, గోపాలకృష్ణ, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఎంపీఓ గౌసోద్దీన్, వైస్ ఎంపీపీ యోగేష్, సర్పంచులు రమేష్ కుమార్, రాజు, గణేష్, కలీమ్ బేగ్, కార్యాలయ సిబ్బంది, క్షేత్ర సహాయకులు తదితరులు పాల్గొన్నారు.