కామారెడ్డి, నవంబర్ 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయ వైద్యశాలలో భవానీపేట్ కి చెందిన రేణుక (35) మహిళ లివర్ సమస్యతో బాధపడుతుండడంతో వారికి బి పాజిటివ్ రక్తం అవసరం కాగా, కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ జిల్లా, ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమూహ సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు.
దీంతో సింగరాయపల్లి గ్రామానికి చెందిన బాలకిషన్ సహకారంతో వీ.టి ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో సకాలంలో రక్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు, రెడ్ క్రాస్ డివిజన్ సెక్రెటరీ జమీల్ మాట్లాడుతూ పట్టణ కేంద్రంలోని రక్తనిధి కేంద్రాలలో రక్త నిలువలు తగ్గిపోవడం జరిగిందని, యువతీ యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు.
కుటుంబ సభ్యులు కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు. రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత బాలకిషన్‌కు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మరియు రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వీ.టి ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ చందన్, సుదర్శన్ గౌడ్ పాల్గొన్నారు.