నిజామాబాద్, నవంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర శివారులోని మల్లారం గ్రామ పరిధిలో ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్ షిప్ ను ఆదివారం అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా సందర్శించారు. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఈ నెల 14 న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బహిరంగ వేలంపాట ద్వారా విక్రయించేందుకు సిద్ధం చేసిన 80 ప్లాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
మౌలిక సదుపాయాల కల్పన పనులు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని, మిగిలిన తుదిదశ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో మొట్టమొదటి ప్రభుత్వ వెంచర్ అయినందున సౌకర్యాల కల్పనలో ఎక్కడా రాజీ పడకూడదని, అన్ని వసతులతో మోడల్ టౌన్ షిప్ గా రూపొందాలన్నారు. ధాత్రి టౌన్ షిప్ విషయంలో ఇప్పటికే జిల్లా పాలనాధికారి ప్రతి విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని గుర్తు చేశారు.
ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు, డీటీసీపి అప్రూవ్డ్ లేఔట్ అయినందున సొంత ఇంటి కలను సాకారం చేసుకునేందుకు ధాత్రి టౌన్ షిప్ ఎంతో అనుకూలమైనదని అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా పేర్కొన్నారు. తక్కువ ధరకే నివాస స్థలాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, ఎన్‌ఆర్‌ఐలకు సులభ వాయిదాల వెసులుబాటుతో రుణ సదుపాయం కల్పించేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఐదు, పది సంవత్సరాల కాలపరిమితితో తక్కువ మొత్తం నెలవారీ కిస్తులు చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నాయని అన్నారు.
సకల సదుపాయాలతో సర్వాంగ సుందరంగా మోడల్ టౌన్ షిప్ రూపుదిద్దుకుంటోందని, పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివరించారు. సువిశాలమైన 60 ఫీట్ల అప్రోచ్ రోడ్డు, 30 నుండి 40 ఫీట్ల విస్తీర్ణంతో కూడిన అంతర్గత రోడ్లు, ప్రభుత్వ పరంగానే నీటి వసతి, విద్యుత్ సరఫరా, సి.సి డ్రెయిన్లు, ఎస్.టీ.పి నిర్మాణం జరుగుతోందన్నారు. ధాత్రి టౌన్ షిప్ నుండి కేవలం 9 కీ.మీ దూరంలో నిజామాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఉందని అన్నారు. 76 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో వివిధ సైజులలో మొత్తం 316 ప్లాట్లు టౌన్ షిప్ లో అందుబాటులోకి రానున్నాయని వివరించారు.
తొలి విడతలో 80 ప్లాట్ల అమ్మకాల కోసం ఈ నెల 14న ఉదయం 9.00 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్)లో బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుందనని అన్నారు. తొలి రోజు 40 ప్లాట్లకు, 15వ తేదీన మిగతా40 ప్లాట్లకు వేలం జరుగుతుందన్నారు. ఈ.ఎం.డి 10వేలు చెల్లించి బహిరంగ వేలంలో ఎవరైనా పాల్గొనవచ్చని, ఒకే ఈ.ఎం.డితో అన్ని ప్లాట్ల వేలంలోనూ పాల్గొనేందుకు అవకాశం (ఏదైనా ప్లాటును దక్కించుకునేంత వరకు) కల్పిస్తున్నామని తెలిపారు.
వేలంలో ప్లాట్ రాని వారికి 10వేల రూపాయల ఈ.ఎం.డి వాపస్ చేయబడుతుందని తెలిపారు. వేలంలో ప్లాట్ దక్కించుకున్న వారు 90 రోజుల వ్యవధిలో మూడు వాయిదాల్లో మొత్తం రుసుము చెల్లించేలా వెసులుబాటు ఉందని అన్నారు.ఒకే విడతలో మొత్తం రుసుము చెల్లించేందుకు ముందుకు వచ్చే వారికి ప్లాట్ ధరలో రెండు శాతం రిబేటు వర్తిస్తుందని వివరించారు. ధాత్రి టౌన్ షిప్ లో వివిధ సైజులలో ఉన్న ప్లాట్ లను ఔత్సాహికులు సొంతం చేసుకునేందుకు 14వ తేదీన నిర్వహించనున్న బహిరంగ వేలంలో పాల్గొనాలని, ఉగ్యోగస్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. అదనపు కలెక్టర్ వెంట నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ అనిల్, టీఎస్‌ఐఐసి మేనేజర్ దినేష్ తదితరులు ఉన్నారు.