కామారెడ్డి, నవంబర్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన శివశంకర్, నాగేశ్వర్ రమేష్, ప్రవీణ్ ఆదివారం తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం మానవతా దృక్పథంతో స్పందించి, స్వచ్ఛందంగా పట్టణ కేంద్రంలోని వీ.టి ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో 4 యూనిట్ల రక్తాన్ని అందజేశారని ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్ గుప్తా, రెడ్ క్రాస్, ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమూహ సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా విశ్వనాథుల మహేష్ గుప్తా, డాక్టర్ బాలు మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ సోమవారం శ్రీ పరంజ్యోతి కల్కి భగవాన్ ఆలయంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని, మానవత్వంతో స్పందించి రక్తదాతలందరూ ముందుకు వచ్చి రక్తదానం చేసి తలసేమియా చిన్నారుల ప్రాణాలను కాపాడాలని అన్నారు.
చిన్నారులకు ప్రతి 20 రోజులకు ఒకసారి ఒక యూనిట్ రక్తాన్ని అందజేయవలసి ఉంటుందని గత నెలలో 189 యూనిట్ల రక్తాన్ని అందజేయడం జరిగిందని, ఈ శిబిరంలో 200 యూనిట్ల రక్తాన్ని సేకరించి 200 చిన్నారుల ప్రాణాలను కాపాడాలని మహోన్నతమైన సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.
స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతలకు కామారెడ్డి జిల్లా కలెక్టర్, రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షుడు జతేష్ వి పాటిల్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఈ నెల 21వ తేదీన జరిగే రక్తదాన శిబిరంలో వందలాది మంది రక్తదాతలు రక్తదానానికి ముందు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వి.టీ ఠాగూర్ రక్త నిధి కేంద్రం టెక్నీషియన్ చందన్ పాల్గొన్నారు.