నిజామాబాద్, నవంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ సి.నారాయణరెడ్డి నేతృత్వంలో టీఎస్‌ఐఐసి ఆధ్వర్యంలో ధాత్రి టౌన్ షిప్ ప్లాట్ల వేలంపాట ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. నిజామాబాద్‌కు ఆనుకుని మల్లారం వద్ద ప్రభుత్వపరంగా అన్ని వసతులతో నెలకొల్పిన ధాత్రి టౌన్ షిప్‌లో మొదటి విడతగా 80 ప్లాట్ల విక్రయాల కోసం బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు.
ఈ నెల 14, 15 తేదీలలో రెండు రోజుల పాటు వేలం ప్రక్రియ కొనసాగనుంది. ఇందులో భాగంగా తొలి రోజైన సోమవారం ఉదయం వేళలో 20 ప్లాట్లకు, మధ్యాహ్నం సమయంలో మిగతా 20 ప్లాట్లకు ఓపెన్ ఆక్షన్ జరిగింది. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ వేలం పాట నిర్వహించారు. ఎల్.ఈ.డి స్క్రీన్ ద్వారా ఒక్కో ప్లాట్ వారీగా వివరాలను స్పష్టంగా ప్రదర్శించారు. వేలం ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, బిడ్డర్ల నుండి ఈ.ఎం.డీ ధరావత్తు పది వేల రూపాయల డీ.డీ ని స్వీకరిస్తూ, టోకెన్లు, దరఖాస్తు ఫారాలు అందించారు.
టోకెన్ కలిగిన వారిని మాత్రమే వేలంపాట జరిగే సమావేశం హాల్ లోనికి అనుమతించారు. వేలంలో పాల్గొనే బిడ్డర్ల సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు, శని, ఆదివారాలు సెలవు దినాలు రావడాన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాంకు డీ.డీలు తీసేందుకు వీలుగా ప్రత్యేక కౌంటర్ సైతం అందుబాటులో ఉంచారు. ఈఎండి చెల్లించిన వారితో పాటు, ఇదివరకు రాజీవ్ స్వగృహలో దరఖాస్తులు చేసుకుని ఒరిజినల్ రసీదులు కలిగి ఉన్న బిడ్డర్లు ఎంతో ఉత్సాహంగా వేలం పాటలో పాల్గొన్నారు.
ఒక్కో ప్లాట్ వారీగా అధికారులు నిబంధనలను అనుసరిస్తూ వేలం ప్రక్రియను నిర్వహించారు. ప్రతి ప్లాట్‌కు కూడా ముందుగానే ఖరారు చేసిన విధంగా ఒక చదరపు గజానికి 8 వేల రూపాయల ప్రారంభ ధర ప్రకటించగా, బిడ్డర్లు తమకు నచ్చిన ప్లాట్లకు వేలంలో అధిక ధర పాడారు. అధిక ధర పాడిన వారికి ప్లాట్ ఖరారైనట్లు అధికారులు ప్రకటించారు. ప్లాట్లు ఖరారైన వారికి ఈ మేరకు అధికారికంగా కేటాయింపు లేఖలు అందజేశారు.
వారం వ్యవధిలో 33శాతం మొత్తాన్ని, 45 రోజుల్లో మరో 33 శాతం రుసుమును, 90 రోజుల్లో మిగతా మొత్తాన్ని చెల్లించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. కాగా, మంగళవారం మరో 40 ప్లాట్లకు ఇదే తరహాలో బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుందని, సకాలంలో బిడ్డర్లు హాజరు కావాలని అదనపు కలెక్టర్ కోరారు. వేలం ప్రక్రియలో అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, నిజామాబాద్ ఆర్దీఓ రవి, టీఎస్‌ఐఐసి జిల్లా మేనేజర్ దినేష్, తహసీల్దార్లు అనిల్, సుదర్శన్, రషీద్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.