కామారెడ్డి, నవంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్, ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు 65 ఇంచులు గల మినీ థియేటర్‌ను మాజీ జెడ్పిటిసి పడిగెల.రాజేశ్వరరావు తన సొంత ఖర్చులతో నాణ్యమైన మినీ థియేటర్ టి.వి.ని విద్యార్థులకు బాలల దినోత్సవం సందర్బంగా అందజేశారు.
హాస్టల్లో ఉంటూ చదువుకునే విద్యార్థినిలకు టీ సాట్ ద్వారా అందించే ఆన్లైన్ తరగతులు ప్రత్యక్షంగా చూడడానికి అవకాశం ఉంటుందనే దాతృత గుణముతో 55 వేల విలువ గల మినీ థియేటర్ టీవీని మోడల్ స్కూల్‌కు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పేరెన్నిక గల ఈ పాఠశాల, కళాశాలలో నాణ్యమైన చక్కటి విద్యను అందిస్తున్నారని, ఇందులో చదివే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత పదవుల్లో అధిరోహించి వారి తల్లిదండ్రులకు చదువుకున్న పాఠశాలకు వాళ్ల గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
అంతేకాకుండా భవిష్యత్తులో మీరు కూడా మంచి ఉద్యోగంలో, వ్యాపార వాణిజ్య రంగాలలో స్థిరపడి సాటి మనుషులకు ఈ విధంగా చేదోడు వాదోడుగా ఉపయోగపడాలన్నారు. ప్రిన్సిపాల్ భానుమతి మాట్లాడుతు తమ పాఠశాల, కళాశాలలో 750 మంది విద్యార్థులకు ఆన్లైన్, ఇతర చరిత్ర కారుల, ప్రపంచ విషయాలు అవసరం మేరకు ప్రత్యక్షంగా చూపించే వీలుంటుందని తెలిపారు.
ఈ సహాయం చేసిన రాజేశ్వర్ రావుకి తమ పిల్లల తరపున వారి తల్లితండ్రుల తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షులు భూంరెడ్డి, అల్లూరు ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ సదాశివరెడ్డి, ధర్మరావుపేట నివాసి హైదరాబాదులో పనిచేస్తున్న ప్రముఖ హౌసింగ్ బిల్డర్ గైని సురేష్, అధ్యాపకులు రాజశేఖర్, రాజేందర్, లింగమయ్య, దశరథ్, అరవింద, చిత్ర, నీరజ, రమేష్, రమణ, జిజియా, వాసవి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.