హైదరాబాద్, నవంబర్ 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాజిక సమస్యలు, ఆందోళనలకు పరిష్కారం చూపే దిశగా నాణ్యమైన పరిశోధన జరగాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి, ఐసీఎస్‌ఎస్‌ఆర్ -ఎస్‌ఆర్సీ ఛైర్మన్ ప్రొఫెసర్ డి. రవిందర్ యాదర్ ఆకాంక్షించారు. భిన్న విభాగాల మేళవింపుతో పరిశోధనలు – విధానపరమైన చిక్కులపై దృష్టి సారించాలని సూచించారు.
పరిశోధనల్లో కేస్ స్టడీస్‌ను అభివృద్ధి చేయటానికి ఉన్న ప్రాముఖ్యతను వీసీ వివరించారు. అధ్యాపకులు, పరిశోధన విధ్యార్థుల కోసం ఈ నెల 14 నుంచి 21 వరకు ఏడు రోజుల పాటు జరగనున్న రీసెర్చ్ మెథడాలజీ స్టేజ్ -2 సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు.
ఐసీఎస్‌ఎస్‌ఆర్ దక్షిణ ప్రాంతీయ కార్యాలయం, భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దక్షిణ భారతదేశం నుంచి సాంఘిక శాస్త్ర అధ్యాపకుల వద్ద పరిశోధనలు చేస్తున్న 30 మంది పరిశోధక విద్యార్థులు, సదస్సుకు హాజరవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. ఐసీఎస్‌ఎస్‌ఆర్ – ఎస్‌ఆర్సీ డైరెక్టర్ సీనియర్ ప్రొఫెసర్ వి.ఉషాకిరణ్ కోర్సు ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ జాకబ్ కల్లే, ఇతర అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు.